- డబ్బులు డిపాజిట్ చేయడానికి ఏటీఎంకు వెళ్లిన బాధితుడు
- క్యాష్ ఇవ్వాలని దుండగుల బెదిరింపులు
- ప్రతిఘటించడంతో రెండు రౌండ్ల కాల్పులు
- అనంతరం నగదుతో పాటు స్కూటీతో ఎస్కేప్
హైదరాబాద్ కోఠిలో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిపై ఇద్దరు ఆగంతకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి అతడి వద్ద ఉన్న రూ.6 లక్షల నగదు, స్కూటీని ఎత్తుకెళ్లారు.
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ లోని కోఠిలో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిపై ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపి అతని వద్ద ఉన్న నగదుతో పాటు అతని స్కూటీని కూడా ఎత్తుకెళ్లారు. కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన రిన్షాద్ (26) సిటీలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఓల్డ్ సిటీలోని దివాన్ దేవిడి ప్రాంతంలో బట్టలు కొనేందుకు జనవరి 7న రూ.6 లక్షలతో హైదరాబాద్ వచ్చాడు.
నాంపల్లిలోని అతని స్నేహితుడు అమీర్ ఉంటున్న జన్నత్ అపార్ట్ మెంట్ లో బస చేశాడు. అయితే కొనుగోలు విరమించుకొని, అతని బంధువు సలహా మేరకు ఆ డబ్బులను అకౌంట్ లో డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం ఉదయం అతని స్నేహితుడు అమీర్ స్కూటీపై నగదును బ్యాగ్ లో పెట్టుకొని , డిపాజిట్ చేసేందుకు కోఠి బ్యాంక్ స్ట్రీట్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం వద్దకు 6 గంటల 50 నిమిషాలకు చేరుకున్నాడు. ముందుగానే అక్కడ రెక్కీ నిర్వహిస్తున్న ముఖానికి మాస్క్ వేసుకున్న ఇద్దరు ఆగంతకులు రిన్షాద్ ను అడ్డుకుని గన్ పెట్టి బెదిరించారు.
రిన్షాద్ ప్రతిఘటిస్తుండంగానే... ఆగంతకులు అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక బులెట్ బాధితుడి కుడి కాలు భాగంలో దిగడంతో అతడు నిస్సహాయకుడిగా ఉండిపోయాడు. వెంటనే అతని వద్ద ఉన్న నగదు, వాహనంతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రిన్షాద్ ను హాస్పిటల్ కు తరలించారు.
క్లూస్ టీమ్ ఆ ప్రదేశాన్ని ఆధీనంలోకి తీసుకొని వివరాలను సేకరించింది. అడిషనల్ సీపీ క్రైమ్స్ శ్రీనివాస్, జాయింట్ సీపీ శ్వేతా, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో దుండగులు దోపిడీకి ప్లాన్ చేశారు.
