ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఆధిక్యంలో ABVP

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఆధిక్యంలో ABVP


ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఢిల్లీ యూనివర్శిటీలోని నార్త్ క్యాంపస్‌ మల్టీపర్పస్ హాల్, యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియంలో జరుగుతోన్న ఓట్ల లెక్కింపులో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ సత్తా చాటుతోంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ అన్ని పదవుల్లో ఏబీవీపీ లీడింగ్‎లో కొనసాగుతోంది. డీయూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలో ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థి ఆర్య మాన్ ఆధిక్యంలో దూసుకుపోతున్నాడు.

10వ రౌండ్ ముగిసే వరకు ఆర్యమాన్ 10 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నాడు. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్‎ఎస్‎యూఐ తరుఫున బరిలోకి దిగిన జోస్లిన్ నందితా చౌదరి  రెండవ స్థానంలో ఉన్నారు. లెఫ్ట్ అలయన్స్ (SFI, AISA)కి చెందిన అంజలి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆర్యమాన్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఈ సారి ఏబీవీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు 2025, సెప్టెంబర్ 18న జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో 40 శాతం పోలింగ్ నమోదైంది. 2.75 లక్షల మంది విద్యార్థులు ఓటు వేశారు. 52 సెంటర్లు, 195 బూత్‎లలో పోలింగ్ జరగగా 711 ఈవీఎంలు వినియోగించారు. రెండు షిఫ్టుల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. ఆ తర్వాత 3 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు ఓటింగ్ జరిగింది. వివిధ పోస్టులకు మొత్తం 21 మంది పోటీ పడ్డారు. ఇందులో ప్రెసిడెంట్ పోస్టుకు 9 మంది.. ఇతర పోస్టులకు 12 మంది పోటీ చేశారు. 

ABVP, NSUI మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ఏబీవీపీ నుంచి లైబ్రరీ సైన్స్ డిపార్టుమెంట్‎కు చెందిన ఆర్యన్ మాన్ బరిలోకి దిగాడు. మెట్రో పాసులు, ఫ్రీ వైఫై, బెటర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్‎పై ఆర్యన్ క్యాంపెయిన్ చేశాడు. NSUI నుంచి పీజీ స్టూడెంట్ జోస్లిన్ నందితా చౌదరి పోటీ చేశారు. హాస్టల్ షార్టేజ్, క్యాంపస్ సేఫ్టీ, మెన్ స్ట్రువల్ లీవ్స్‎పైన నందితా ప్రచారం చేశారు. లెఫ్ట్ SFI , All India Students' Association (AISA) అలయన్స్‎లో తరుపున అంజలి పోటీ చేశారు. అంజలి జెండర్ సెన్సిటేషన్, గ్రీవియెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం పునరుద్ధరణ, ఫీజుల పెంపుపై క్యాంపెయినింగ్ చేశారు.