
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగిన దుర్ఘటనలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రమాదంలో గాయపడిన బాధితులకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం, ఇతర సహకారాన్ని అందించేలా ఈ అధికారులు చూడనున్నారు. ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్యాన్ని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వారికి అందుతున్న ట్రీట్మెంట్, అవసరమైన ఇతర సహాయాలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. అలాగే, ప్రణామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్య విధాన పరిషత్ కమిషనర్, డాక్టర్ అజయ్ కుమార్ మానిటర్ చేస్తున్నారు. అదే విధంగా అర్చన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్యాన్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ నాయక్ పర్యవేక్షిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిలో ఏమైనా మార్పులు ఉన్నాయా, వారికి అవసరమైన అదనపు చికిత్స ఏదైనా ఉందా అనే విషయాలను ఆయన పరిశీలిస్తున్నారు.