IND A vs AUS A: ఆస్ట్రేలియా ఏ తో తొలి టెస్ట్ డ్రా.. 150 పరుగులతో వెస్టిండీస్‌ టెస్ట్ సిరీస్‌ రేస్‌లో RCB క్రికెటర్

IND A vs AUS A: ఆస్ట్రేలియా ఏ తో తొలి టెస్ట్ డ్రా.. 150 పరుగులతో వెస్టిండీస్‌ టెస్ట్ సిరీస్‌ రేస్‌లో RCB క్రికెటర్

ఆస్ట్రేలియా 'ఏ', ఇండియా 'ఏ' జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రా గా ముగిసింది. నాలుగు రోజుల పాటు లక్నో  వేదికగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో బ్యాటర్లు ఆధిపత్యం చూపించడంతో ఫలితం రాలేదు. 4 వికెట్ల నష్టానికి 403 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఏ 7 వికెట్ల నష్టానికి 531 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలో 56 పరుగులు చేసింది. నాలుగు రోజుల ఆట ముగియడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా గా ప్రకటించారు. 

పడికల్ సెంచరీ:

4 వికెట్ల నష్టానికి 403 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఏ ఇన్నింగ్స్ ను పడికల్, జురెల్ ముందుకు తీసుకెళ్లారు. మూడో రోజు 86 పరుగులతో అజేయంగా నిలిచిన పడికల్ నాలుగో రోజు తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా ఈ కర్ణాటక ప్లేయర్ తన జోరు చూపించాడు. ఓవరాల్ గా 281 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ తో 150 పరుగులు చేసి ఇండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఎండ్ లో జురెల్ 140 పరుగులతో సత్తా చాటాడు. పడికల్ ఔటైన కాసేపటికి ఇండియా ఏ తమ తొలి ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

Also Read:-ఇండియా గెలవకున్నా టాప్‌లోనే.. ఆసియా కప్ సూపర్-4 షెడ్యూల్ ఇదే!

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ రేస్ లో పడికల్:

వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్ కి పడికల్ రేస్ లోకి వచ్చాడు. 150 పరుగులు చేసిన పడికల్ మూడో స్థానంలో సాయి సుదర్శన్ కు గట్టి పోటీ ఇవ్వనున్నాడు. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ 73 పరుగులతో రాణించినా పడికల్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. ప్లేయింగ్ 11 లో స్థానం దక్కించుకోపోయినా స్క్వాడ్ లో ఉండే అవకాశం ఉంది.