
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్ కలిసి పరేషాన్ చేస్తుండ్రు
- కుటుంబంలో గొడవలకు ఆస్తి, ఆధిపత్య అంశాలే కారణం
- బీఆర్ఎస్ కు జీవం పోసేందుకే బీజేపీ యూరియా కొరత డ్రామా
- ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించడం లేదు
- కాళేశ్వరం ఇస్తే ఇప్పటికీ విచారణ ప్రారంభించలే
- సీబీఐ ఎంక్వైరీ జరగకుండా కిషన్ రెడ్డి సహకరిస్తుండు
- సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు
- రాష్ట్రంలో మెట్రో విస్తరణ జరగకుండా కుట్రలు
- ఫ్యామిలీలో నలుగురు కలిసి కవితపై దాడి చేస్తుండ్రు
- చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబంలో నలుగురు టార్గెట్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు కలిసి ఒక మహిళపై దాడిచేస్తున్నారని ఆరోపించారు. వాళ్ల కుటుంబంలోని గొడవలకు ఆస్తి, ఆధిపత్య అంశాలే కారణమని అన్నారు. కవిత జైలుకు వెళ్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నం చేశారని సీఎం అన్నారు. వాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రాణం పోసేందుకు బీజేపీ నేతలు యూరియా కొరత డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేసిన దుష్ప్రచారం వల్లే రైతులు ఎక్కువగా యూరియా కొంటున్నరన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ రైతులను శిక్షిస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న లక్ష్యంతోనే ఉన్నామని అన్నారు. ఎన్నికల విషయంలో అన్ని పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలని అడుగుతామని చెప్పారు. బిల్లుల పెండింగ్ పై సుప్రీం తీర్పు తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి ఇయ్యలె..
తాము ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు ప ర్యవేక్షిస్తోందని చెప్పారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ డిమాండ్ చేశారని, అప్పగిస్తే 48 గంటల్లో విచారన ప్రారంభిస్తామని చెప్పారని సీఎం అన్నారు. ఇన్ని రోజులు గడిచినా సీబీఐ విచారణ ప్రారంభించలేదని చెప్పారు. కాళేశ్వరం కేసులో సీబీఐ ఎంక్వైరీ జరగకుండా కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని అన్నారు.
మెట్రోపై కుట్రలు
రాష్ట్రంలో మెట్రో విస్తరణ జరగకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాను ఢిల్లీ వెళ్లి మెట్రో విస్తరణ కోసం ప్రధాన మంత్రిని కలిసిన ప్రతి సారి ఎల్ అండ్ టీ సంస్థ నష్టాలను తెరమీదకు తెస్తోందని అన్నారు. మెట్రో కొత్త ప్రాజెక్టు కాదని, ఉన్నదానినే విస్తరిస్తున్నామని చెప్పారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని సీఎం చెప్పారు. కేటీఆర్ మాట్లాడితే లోకేశ్ తమ్ముడి లాంటి వాడని అంటున్నారని, చంద్రబాబును, లోకేశ్ ను జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
నక్సల్స్ చర్చిస్తే తప్పేంటి
నక్సలైట్లు జనజీవన స్రవంతి లోకి రావడానికి ప్రోత్సహించాలని సీఎం రేవంత్ అన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతోనే చర్చలు జరిపినప్పుడు మన సోదరులైన నక్సలైట్లతో చర్చలు జరపటానికి అభ్యంతరం ఏమిటని సీఎం ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో వందల మంది చావుకు కేసీఆర్ కుటుంబం కారణమైందని, ఆ తల్లులకు ఉసురు తగిలి ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో ముసలం ఏర్పడిందని సీఎం అన్నారు.
ALSO READ : ముస్లిం మైనారిటీలకు సీఎం రేవంత్ కానుక.
కొడంగల్ లోనే 50 వేల ఓట్లు డిలీట్
తాను 2018లోనే ఓట్ చోరీ విషయాన్ని చెప్పినట్టు రేవంత్ తెలిపారు. తెలంగాణలోనే 24 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో యాభై వేల ఓట్లు డిలీట్ చేశారని సీఎం చెప్పారు. బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్తానని సీఎం చెప్పారు. ప్రశాంత్ కిషోర్ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయొచ్చు కానీ తాము ఉత్తరాదికి వెళ్లొద్దా..? అని సీఎం ప్రశ్నించారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు 8 వేల కోట్ల నష్టం జరిగిందని, కనీసం ఐదేండ్ల పాటు కేంద్రం ఈ గ్యాప్ ను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.