మెహదీపట్నంలో చైన్ స్నాచింగ్.. వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్స్

మెహదీపట్నంలో చైన్ స్నాచింగ్.. వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్స్

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు.మాస్కులు పెట్టుకొని బైకులపై వచ్చి మహిళ మెడలోంచి లక్షల విలువ చేసే బంగారు పుస్తెల తాడులు తెంచుకొని వెళ్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మాటల్లో పెట్టి ఓ వ్యక్తినుంచి బ్రాస్ లెట్ కొట్టేసిన సంఘటన చూశాం. జల్సాలకు అలవాటుపడిన కొందరు యూత్ చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న తెలుస్తోంది. అయితే వారి ఆగడాలకు ఎప్పటికప్పుడు పోలీసులు చెక్ పెడుతున్నారు.తాజాగా సిటీలోని మెహదీపట్నంలో చైన్ స్నాచింగ్ పాల్పడి పారిపోతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు వెంబడి మరీ పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

శుక్రవారం (సెప్టెంబర్ 19) ఉదయం మెహదీపట్నంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఉదయం 7 గంటల సమయంలో కోకాపేట్ నుంచి మెహదీప్నటం వచ్చిన మౌనిక అనే యువతి రోడ్ క్రాస్ చేస్తుండగా చైన్ స్నాచర్ షేక్ సలీమ్ ఆమె మెడలోంచి గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు విక్రం, సిద్ధార్థ.. మౌనిక కేకలు విని అప్రమత్తమయ్యారు. నిందితుడిని వెంబడించారు. 

కొంత దూరం వరకు వెంబడించిన కానిస్టేబుళ్లు చివరికి చైన్ స్నాచర్ సలీమ్ ను పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 15 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటనపై ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్ వివరాలు వెల్లడించారు. 

పోలీసుల విచారణలో నిందితుడు షేక్ సలీమ్ నుంచి షాకింగ్ విషయాలు రాబట్టారు పోలీసులు. చైన్ స్నాచింగ్ ఎలా చేయాలి.. తర్వాత ఎలా తప్పించుకోవాలి అని యూట్యూబ్ లో వీడియోలు చూసి నేర్చుకున్నట్లు నిందితుడు చెప్పారు. 

సమయస్ఫూర్తిగా స్పందించిన విక్రం, సిద్ధార్థ ధైర్యసాహసాలను ఏసీపీ ప్రశంసించారు. వారి పనితీరును అభినందించిరివార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు.

చైన్ స్నాచింగ్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. పెట్రోలింగ్, నిఘా పెంచారు. అయినప్పటికీ ప్రజలు కూడా వ్యక్తిగత భద్రత పట్ల జాగ్రత్త వహించడం ముఖ్యం. దొంగతనం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ సూచించారు.