ఇండియాలో వాటా అమ్మే ఆలోచన లేదు.. అదానీ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌పైనే దృష్టి : ఎమ్మార్ ప్రాపర్టీస్

ఇండియాలో వాటా అమ్మే ఆలోచన లేదు.. అదానీ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌పైనే దృష్టి : ఎమ్మార్  ప్రాపర్టీస్

దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ భారతీయ కంపెనీలలో వాటాలను విక్రయించబోమని తేల్చి చెప్పింది, అయితే ఆదానీ గ్రూప్‌తో సహా భారతదేశంలోని పెద్ద వ్యాపార సంస్థలతో జాయింట్ వెంచర్‌ ఏర్పాటు చేయాలని కంపెనీ పరిశీలిస్తోంది.

దీనికి సంబంధించి సెప్టెంబర్ 18న దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో జరిగిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎమ్మార్ ప్రాపర్టీస్ కంపెనీ భారతీయ సంస్థలలో వాటాలను విక్రయించే ఆలోచన ఇకపై లేదు అని తెలిపింది. దీనికి బదులు  కంపెనీ భారతదేశంలోని ఇతర పెద్ద కంపెనీలు/గ్రూపులతో లేదా అదానీ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌ పరిశీలిస్తోందని చెప్పింది. 

దుబాయ్‌కు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ 2005లో భారతదేశ MGF డెవలప్‌మెంట్ భాగస్వామ్యంతో భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ జాయింట్ వెంచర్ సంస్థ ఎమ్మార్ MGF ల్యాండ్ ద్వారా దాదాపు రూ.8,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఏప్రిల్ 2016లో ఎమ్మార్ ప్రాపర్టీస్ విభజన ద్వారా జాయింట్ వెంచర్‌ను క్లోజ్ చేయాలనీ నిర్ణయించుకుంది.

ఎమ్మార్ ఇండియాకి ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, మొహాలి, లక్నో, ఇండోర్, జైపూర్‌లలో పెద్ద సంఖ్యలో రెసిడ్నేషియల్ అండ్ కమర్షియల్ స్థలాలు ఉన్నాయి. అదానీ గ్రూప్ అన్‌లిస్టెడ్ కంపెనీలు అదానీ రియాల్టీ, అదానీ ప్రాపర్టీస్ ద్వారా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనసాగుతుంది. 

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావితో సహా రిడెవలప్మెంట్ ప్రాజెక్టులను కూడా ఈ  గ్రూప్ సొంతం చేసుకుంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ PJSC ప్రపంచంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటి. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా సహా  ఆసియాలో దీనికి వ్యాపారాలు ఉన్నాయి. 

ఈ కంపెనీకి UAE సహా అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు 1.7 బిలియన్ చదరపు అడుగుల స్థలం దాని అధీనంలో ఉంది. 2002 నుండి ఎమ్మార్ దుబాయ్ ఇంకా ఇతర ప్రపంచ మార్కెట్లలో 1,22,000 కంటే పైగా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ డెలివరీ చేసింది. వరల్డ్ ఫెమస్ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ ఎమ్మార్ ప్రాపర్టీస్ అభివృద్ధి చేసిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటి.