- మార్చికల్లా ‘ఫ్యూచర్ సిటీ’లో ఫేజ్ 1 సొంత క్యాంపస్
- మైక్రోసాఫ్ట్, స్విగ్గీ, ఏఐజీతో ల్యాబ్‌ల ఏర్పాటుకు ఒప్పందాలు
- త్వరలోనే న్యూక్లియర్ మెడిసిన్, లైఫ్ సైన్సెస్ డిగ్రీ కోర్సులు
‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ అతి తక్కువ సమయంలోనే కీలక మైలురాయిని అధిగమించింది. 2025, డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీ ద్వారా 1,000 మందికి పైగా స్టూడెంట్లు స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2024, ఆగస్టు 1న శంకుస్థాపన చేసిన ఈ వర్సిటీ, కేవలం 16 నెలల్లోనే అద్భుత ఫలితాలను సాధించింది.
హైదరాబాద్, వెలుగు: ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ తక్కువ సమయంలోనే కీలక మైలురాయిని అధిగమించింది. ఇందులో 2025 డిసెంబర్ నాటికి1,000 మందికిపైగా స్టూడెంట్లు స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.చదువుతో పాటే కొలువును ఖాయం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ వర్సిటీ.. ఏడాదిన్నరలోనే వెయ్యి మందిని ‘ఇండస్ట్రీ రెడీ’గా తీర్చిదిద్ది రికార్డు సృష్టించింది. 2024, ఆగస్టు 1న శంకుస్థాపన చేసిన ఈ వర్సిటీ, కేవలం 16 నెలల్లోనే అద్భుత ఫలితాలను సాధించింది.
ఇప్పటివరకు శిక్షణ పొందిన వెయ్యి మందిలో ‘స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్’ నుంచి 258 మంది స్టూడెంట్లు ఉండగా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ)లో 207 మంది, ధ్రువ ఫౌండేషన్ ద్వారా 121 మంది, హెల్త్ కేర్ విభాగంలో 90 మంది స్టూడెంట్లు నైపుణ్యాలు సాధించారు. వీరే కాకుండా.. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ వంటి దిగ్గజ సంస్థల సహకారంతో నిర్వహించిన షార్ట్ టర్మ్ కోర్సుల్లో వందలాది మంది యువత ఉపాధి దిశగా అడుగులు వేశారు.
ల్యాబ్‌ల ఏర్పాటుకు మైక్రోసాప్ట్ ముందుకు
ఫ్యూచర్ సిటీలో ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, స్విగ్గీ, ఏఐజీ హాస్పిటల్స్, టెక్ మహీంద్రా వంటి సంస్థలు ముందుకొచ్చాయి. ఈ సంస్థల కోసం క్యాంపస్‌లో దాదాపు 22,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా, కోర్సు పూర్తయిన వెంటనే తమ సంస్థల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం (2026–27) నుంచి వర్సిటీ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇప్పటివరకు అందిస్తున్న షార్ట్ టర్మ్, సర్టిఫికేషన్ కోర్సులతో పాటు పూర్తి స్థాయి డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించేందుకు వైస్ చాన్స్‌లర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఏఐజీ హాస్పిటల్స్ సహకారంతో బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, ఫార్మా కంపెనీలతో కలిసి బీఎస్సీ అప్లైడ్ లైఫ్ సైన్సెస్, అలాగే ఎంబీఏ లైఫ్ సైన్సెస్ వంటి వినూత్న కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
మార్చి నాటికి ఫేజ్ 1 కంప్లీట్
హైదరాబాద్‌కు దగ్గరలోని కందుకూరు మండలం ‘ఫ్యూచర్ సిటీ’లో 57.8 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీ పర్మినెంట్ క్యాంపస్ నిర్మాణం వేగంగా కొనసాగుతున్నది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో భాగంగా.. 2026, మార్చి నాటికల్లా ఫేజ్ 1 క్యాంపస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందులో 43 క్లాస్‌రూమ్‌లు, 600 బెడ్లతో హాస్టల్, 84 వేల చదరపు అడుగుల్లో అత్యాధునిక ల్యాబ్ నిర్మాణం తుది దశకు చేరుకుంటున్నది. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు.
