కాలం చెల్లిన సిలబస్ ను పక్కనపెడ్తం : ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

కాలం చెల్లిన సిలబస్ ను పక్కనపెడ్తం :  ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
  • హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్​లో మార్పులు తీసుకొస్తం: బాలకిష్టారెడ్డి
  •     డిగ్రీ సిలబస్​లో  ఏఐ సబ్జెక్టులు
  •     ఇంగ్లీష్​ భయం పోగొట్టేలా మెటీరియల్ రెడీ చేశామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కొత్త ఏడాదిలో ఉన్నత విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తామని, కాలం చెల్లిన సిలబస్​ను పక్కనపెట్టి.. మార్కెట్​కు అవసరమైన సబ్జెక్టులను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్​ పర్సన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్​మెంట్ సీట్ల భర్తీని పూర్తిగా ఆన్​లైన్ విధానంలోకి తెచ్చేలా సర్కార్​కు ప్రతిపాదనలు పంపామని వివరించారు. 

కొత్త ఏడాదిలో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘ఉద్యోగాల సాధనలో గ్రామీణ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్​ ప్రధాన అడ్డంకిగా మారుతున్నది. ఈ భయాన్ని పోగొట్టేందుకు నిపుణులతో సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్​ పాఠ్యాంశాలను రూపొందించాం. వీటిని పీడీఎఫ్ రూపంలో వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచుతాం. 2026లో ఈ మెటీరియల్​ను విద్యార్థులకు మరింత చేరువ చేస్తాం. వెబ్​సైట్​ను కూడా స్టూడెంట్లకు ఈజీగా అర్థమయ్యేలా మారుస్తాం’’అని బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.

 కోర్సుల కుదింపు తప్పదు

దోస్త్​ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో నిరుడు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రేషనలైజేషన్ చేపడుతున్నట్లు బాలకిష్టారెడ్డి చెప్పారు. ‘‘సీట్లు మిగిలిపోవడానికి గల కారణాలను విశ్లేషించాం. డిమాండ్ లేని కోర్సులు, జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలపై అకడమిక్ ఆడిట్ తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయి. కోర్సులు, సీట్ల రేషనలైజేషన్​ 2026లో ప్రధాన ఎజెండాగా ఉంటది. 

డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచడం, లేని వాటిని తగ్గించడంపై ఫోకస్​ పెడతాం. సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునిక టెక్నాలజీతో లింక్​ చేస్తాం. సిలబస్​లో ఏఐ ఆధారిత పాఠ్యాంశాలను చేర్చాం. ఇవి 2026 నుంచి అమల్లోకి వస్తాయి. స్టూడెంట్లకు నచ్చేలా భవిష్యత్​లో ఉపాధి దొరికే కోర్సులకే ప్రయారిటీ ఇస్తాం. 

భవిష్యత్తులో ప్రతి కాలేజీకి ‘న్యాక్’ గుర్తింపు కీలకం కానున్నది. అందుకే 2026ను ‘న్యాక్​ గుర్తింపు సాధన లక్ష్య సంవత్సరం’గా నిర్దేశించుకున్నాం’’అని బాలకిష్టారెడ్డి తెలిపారు. అలాగే, ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్ డెవలప్​మెంట్ కోర్సులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కాలేజీ పారిశ్రామిక సంస్థలతో టైఅప్ అయ్యేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.