- రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీసులు
- ట్రై సిటీలోని హోల్ సేల్ షాపుల్లో తనిఖీలు
- రూ.7 లక్షల విలువైన 238 మాంజా బండిల్స్ సీజ్, కేసులు నమోదు
- నిషేధిత మాంజా విక్రయిస్తే కేసులు తప్పవంటున్న పోలీస్ ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చైనా మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గ్లాస్ పౌడర్, సింథటిక్ కోటింగ్ తో ఉండే చైనా మాంజా గాలిలో ఉండే పక్షులతో పాటు రోడ్లపై వెళ్లే అమాయకుల ప్రాణాలు తీస్తున్నది. ఈ చైనా మాంజా వల్ల ఏటా పదుల సంఖ్యలో జనం గాయపడుతుండగా, గొంతులు తెగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి.
రెండు రోజుల కింద హైదరాబాద్ లో ఒక యువకుడు గాయపడ్డాడు. ఈ క్రమంలో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పండుగకు ముందే చైనా మాంజా విక్రయాలకు చెక్ పెడుతున్నారు. వరంగల్ ట్రై సిటీలోని హోల్ సేల్, రిటైల్ షాపుల్లో తనిఖీలు చేపట్టి చైనామాంజాను సీజ్ చేస్తున్నారు. నిషేధిత మాంజా అమ్మే షాపు ఓనర్లపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇక్కడి నుంచే ఉమ్మడి జిల్లాకు..
వరంగల్ నగరంలో ఓల్డ్ బీట్ బజార్, పిన్నవారిస్ట్రీట్, మట్వాడా, టైలర్ స్ట్రీట్, కుమార్ పల్లి, కాజీపేట తదితర ప్రాంతాల్లో పతంగులు, మాంజా హోల్ సేల్, రిటైల్ షాపులున్నాయి. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి చైనా మాంజా తీసుకొస్తున్న హోల్ సేల్ వ్యాపారులు ఇక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రూరల్ ఏరియాలకు సప్లై చేస్తున్నారు.
ఇదిలాఉంటే చైనా మాంజాకు గ్లాస్ పౌడర్ కోటింగ్ ఉంటుండటంతో పతంగుల పోటీలకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో ఈ చైనా మాంజా వల్ల గాలిలో తిరిగే పక్షులు మృత్యువాత పడుతుండగా, కిందికి వేలాడుతున్న దారాలతో బైకర్స్, పాదచారులు ఎంతోమంది గాయపడుతున్నారు. దీంతో పబ్లిక్ సేఫ్టీ రిస్క్ లో పడుతుండటం, నైలాన్, సింథటిక్, గ్లాస్ కోటింగ్ తో ఉండే మాంజా నేలలో కరిగిపోక పర్యావరణానికి హాని కలిగిస్తుండటంతో చైనా మాంజా క్రయవిక్రయాలపై కేంద్ర ప్రభుత్వం 2016లోనే నిషేధం విధించింది.
వరంగల్ పోలీసులు అలర్ట్..
చైనా మాంజా విక్రయాలపై నిషేధం ఉన్నా వరంగల్ నగరంలోని కొంతమంది వ్యాపారులు ఇష్టారీతిన సేల్స్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి చైనామాంజా బండిల్స్ తెప్పించుకుని ఉమ్మడి జిల్లాకు హోల్ సేల్, రిటైల్ గా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంక్రాంతి సందడి మొదలవడం, పతంగుల సేల్స్ స్టార్ట్ కావడంతో వరంగల్ పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు.
చైనా మాంజా విక్రయాలు జరగకుండా కొరడా ఝుళిపిస్తున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తో పాటు లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో పతంగుల క్రయవిక్రయాలు జరిపే షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చైనామాంజా అమ్మే షాప్ ఓనర్లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.
8 మంది అరెస్ట్, రూ.7 లక్షల మాంజా సీజ్
వరంగల్ ట్రై సిటీలో పతంగులు, మాంజా దారాలు అమ్ముతున్న షాపులపై పోలీసులు కొద్దిరోజులుగా రైడ్స్ చేస్తున్నారు. ఇటీవల వరంగల్ నగరంలోని వివిధ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. హనుమకొండ పీఎస్ పరిధిలో నలుగురు, మిల్స్ కాలనీ ఏరియాలో ఇద్దరు, మట్వాడా, కాజీపేట స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు.
వారి నుంచి మోనో కైట్ ఫైటర్, మోనోఫిల్ గోల్డ్, మోనోఫిల్ ఆల్ట్రా, రెడ్ పాండా, మహాబలి, టీఎన్ మాంజా తదితర కంపెనీల పేరుతో ఉన్న సుమారు రూ.6.8 లక్షల విలువైన 238 చైనామాంజా బండిల్స్, బాబిన్స్, మరో రూ.25 వేలకుపైగా విలువైన 791 సింగిల్ ప్యాకెట్స్ సీజ్ చేశారు.
ప్రభుత్వం నిషేధించినా క్రయవిక్రయాలు జరుపుతుండటంతో ఆయా షాప్ ఓనర్లపై బీఎన్ఎస్ సెక్షన్ 125, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పాటు పర్యావరణానికి హాని కలిగించే చైనామాంజా క్రయవిక్రయాలు జరిపితే చట్టపక్రారం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అమ్మినా, కొన్నా జైలు తప్పదు..
చైనా మాంజా పక్షులు, ప్రజలకు హాని కలగజేస్తున్నది. ఈ ప్రమాదకర చైనామాంజాను అమ్మినా, కొన్నా చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. నిందితులకు ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎక్కడైనా చైనామాంజా విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్
