- ఈ ఏడాది అక్రమాస్తుల కేసుల్లో తేల్చిన ఏసీబీ
- లంచం తీసుకుంటూ చిక్కిన 176 మంది ఉద్యోగులు
- 2025 వార్షిక నివేదికలో ఏసీబీ డీజీ చారుసిన్హా వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టినోళ్లకు సంకెళ్లు వేస్తున్నది. ఈ ఏడాది15 మంది అవినీతి అధికారులను అరెస్టు చేసి, వారి వద్ద రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించి సీజ్చేసింది.
డాక్యుమెంట్ల ప్రకారం వీళ్ల అక్రమాస్తుల విలువ రూ.96.14 కోట్లే ఉన్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. ఒక్కో అధికారి వద్ద రూ.20 కోట్ల నుంచి రూ .100 కోట్ల వరకు ఉన్నట్టు గుర్తించింది. ఇక ఈ ఏడాది మొత్తం 199 కేసుల్లో 273 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
వీరిలో లంచాలు తీసుకుంటూ చిక్కిన 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అధికార దుర్వినియోగానికి సంబంధించిన 26 కేసుల్లో 34 మంది, అక్రమాస్తుల కేసుల్లో 15 మంది అరెస్టయ్యారు. మిగతావాళ్లు ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయ్స్ ఉన్నారు. ఈ మేరకు ఏసీబీ డీజీ చారుసిన్హా బుధవారం 2025 వార్షిక నివేదిక విడుదల చేశారు. ఈ ఏడాది నమోదైన ట్రాప్ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
మూడు నెలల్లోనే 78 కేసులు..
ఏసీబీ డీజీగా చారుసిన్హా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు మూడు నెలల్లోనే 78 కేసులు నమోదు చేశారు. గతేడాది చివరి మూడు నెలలతో పోల్చితే ఇవి రెట్టింపు కేసులు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులతో పాటు టోల్‌ఫ్రీ నంబర్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో వస్తున్న సమాచారం ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు.
అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్న డిపార్ట్‌మెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూనే.. లంచాలు డిమాండ్ చేసిన అధికారులను పక్కా ప్లాన్‌తో వల వేసి పట్టుకుంటున్నారు. తప్పించుకునేందుకు అవకాశం లేకుండా నోట్ల కట్టలతో సహా రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేస్తున్నారు. నోట్లపై ఫింగర్ ప్రింట్స్,
వీడియో రికార్డింగ్, బాధితుల వాంగ్మూలాలను కోర్టులో సాక్ష్యాధారాలుగా ప్రవేశపెడుతున్నారు.
158 మంది రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు..
అవినీతి ఆరోపణలు వచ్చిన్న వివిధ శాఖల్లో ఏసీబీ అధికారులు 26 రెగ్యులర్ ఎంక్వైరీలు నిర్వహించారు. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్టులు, వివిధ సంక్షేమ హాస్టళ్లు సహా వివిధ కార్యాలయాల్లో 54 ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
158 ట్రాప్ కేసుల్లో లంచంగా తీసుకున్న రూ.57.17 లక్షలు సీజ్ చేసి, ఇందులో రూ.35.89 లక్షలు సంబంధిత ఫిర్యాదుదారులకు తిరిగి అప్పగించారు. నిందితులు 158 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. మరోవైపు 115 కేసుల్లో నిందితులను విచారించడంతో పాటు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. 73 మంది అధికారులకు ప్రాథమిక ఇండక్షన్ శిక్షణ నిర్వహించారు. నిందితులు/అనుమానిత అధికారుల ప్రొఫైల్స్ తయారీ, నిఘా పద్ధతులు, బినామీ ఆస్తుల చట్టం, ఆర్థిక లావాదేవీలను గుర్తించడంతో పాటు ప్రజల్లో అవగాహన కలిగించినట్టు చారుసిన్హా తెలిపారు.
