- రూపాయి పతనం, ముడిసరుకుల ధరలు పెరగడమే కారణం
న్యూఢిల్లీ: జీఎస్‌టీ తగ్గింది కదా కార్ల రేట్లు దిగొస్తాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బండ్ల తయారీ కంపెనీలు మరోసారి ధరలను పెంచడానికి రెడీ అవుతున్నాయి. దీంతో జీఎస్‌టీ ప్రయోజనాలు ప్రజలకు అందవని చెప్పొచ్చు. జనవరి నుంచి కనీసం తొమ్మిది ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ఈ పెంపు అన్ని విభాగాల్లో 3 శాతం వరకు ఉండనుంది. హ్యుందాయ్, హోండా, టాటా మోటార్స్, రెనాల్ట్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, నిస్సాన్, బీవైడీ, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లు ధృవీకరించాయి. మారుతి వంటి మరికొన్ని కంపెనీలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయని సమాచారం. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, రూపాయి విలువ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే పడిపోవడం ఈ నిర్ణయానికి కారణమని ఆటోమేకర్లు చెబుతున్నారు.
తగ్గిన ఉత్సాహం..
2025 సెప్టెంబర్‌లో జీఎస్టీ తగ్గింపు వల్ల బండ్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ, ధరలు పెరగనుండడంతో డిమాండ్ తగ్గొచ్చని ఎనలిస్టులు తెలిపారు. సాధారణంగా డిసెంబర్‌లో పాత స్టాక్‌ను క్లియర్ చేసిన తర్వాత జనవరిలో ధరలు పెంచడం ఆటోమొబైల్ రంగంలో ఒక సాంప్రదాయం. గత కొన్నేళ్లుగా కంపెనీలు ఈ పద్ధతిని కొనసాగిస్తున్నాయి. గత తొమ్మిది నెలలుగా ధరలు పెంచలేకపోయామని, కానీ ఇప్పుడు కమోడిటీ ధరలు పెరగడంతో వినియోగదారులపై కొంతభారం వేయాల్సి వస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.
జనవరి 1, 2026 నుంచి తమ మోడళ్లపై సగటున 0.6 శాతం ధరలు పెంచుతామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది . రెనాల్ట్, ఈ నెలలో డస్టర్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని ధరలు సుమారు 2 శాతం పెరుగుతాయి. హోండా కూడా ధరలు పెంచనున్నట్లు తెలిపింది కానీ ఎంతవరకు పెరుగుతాయో వెల్లడించలేదు. లగ్జరీ కార్ల తయారీదారులు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల రూపాయి విలువ పడిపోవడం వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెర్సిడెస్-బెంజ్ ధరలను 2 శాతం వరకు పెంచుతుండగా, బీఎండబ్ల్యూ 3 శాతం వరకు పెంచనుంది. బీవైడీ కూడా ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది.
రూపాయి పతనంతోనే..
2025లో చైనా యువాన్‌తో పోలిస్తే రూపాయి విలువ 8.3 శాతం తగ్గి 12.40 కి పడింది. దీంతో చైనాపై ఆధారపడే ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు బ్యాటరీ సెల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఖర్చులు పెరిగాయి. భారత్ ప్రస్తుతం దాదాపు అన్ని ఈవీ బ్యాటరీ సెల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. టెస్లా తన మోడల్ వైని పూర్తిగా చైనాలో తయారు చేసి భారత్‌లోకి దిగుమతి చేస్తోంది. బీవైడీ కూడా తన సీలయన్ 7 ఎస్‌యూవీ ధరలను జనవరి 2026లో పెంచనుంది.
కొన్ని కమోడిటీ ధరలు ఇటీవల గణనీయంగా పెరిగాయని, మరికొన్ని మాత్రం స్థిరంగా ఉన్నాయని ఒక ప్రముఖ ఆటోమేకర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఇంటర్నల్‌గా ఖర్చులు తగ్గించుకునే మార్గాన్ని చూస్తున్నామని అన్నారు. కానీ ఒక స్థాయికి మించి ఖర్చులను తట్టుకోవడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. మొత్తం మీద, తయారీదారులు పెరుగుతున్న ఖర్చులను పూర్తిగా భరించలేరని పేర్కొన్నారు. అందువల్ల 2026లో కొత్త కారు కొనాలనుకునే వినియోగదారులు తమ జేబులోంచి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
