ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి ఇన్సూరెన్స్ పాలసీదారులను ఇబ్బందులు పెట్టడంపై ఫైర్ అయ్యారు. సామాన్యుల ఆరోగ్య భద్రతను ఈ రెండు వ్యవస్థలు కలిసి ఎలా కొల్లగొడుతున్నాయో ఆమె ఆధారాలతో సహా వివరించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇన్సూరెన్స్ ప్రీమియంల రూపంలో చెల్లిస్తున్నప్పటికీ.. అత్యవసర సమయంలో వారు తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారని మలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు బిల్లులను విపరీతంగా పెంచడం, ఇన్సూరెన్స్ కంపెనీలు సాకులు చెప్పి క్లెయిమ్‌లను రిజెక్ట్ చేస్తుండటం ఒక మాఫియాలా మారిందని ఆమె మండిపడ్డారు. కొన్ని సందర్భాల్లో డబ్బు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని ఆసుపత్రులు చెబుతున్నాయని, ఇలాంటివి అరికట్టాలని ఆమె కోరారు.
మలివాల్ తన ప్రసంగంలో ప్రధానంగా "క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్" పేరుతో జరుగుతున్న మోసాలను ఎండగట్టారు. చాలా సందర్భాల్లో ఆసుపత్రులు ఇన్సూరెన్స్ ఉన్న రోగుల నుంచి సాధారణ రోగుల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల పాలసీ కవరేజ్ మెుత్తం త్వరగా అయిపోతోందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీలు చిన్న చిన్న సాంకేతిక కారణాలను వెతికి పట్టుకుని, బాధితులకు అందాల్సిన నగదును నిలిపివేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో రోగి ప్రాణం కంటే ఆసుపత్రి బిల్లులకే ప్రాధాన్యత లభిస్తోందని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆమె వారించారు.
ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కఠినంగా వ్యవహరించాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్సల ధరలపై పరిమితులు ఉండాలని, ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలని సూచించారు. దేశంలో వైద్యం అనేది వ్యాపారంగా మారిపోయిందని, వేల రూపాయలు చెల్లించి ఇన్సూరెన్స్ కొనుకున్నా లేకపోయినా సామాన్యుడు అప్పుల పాలు కావాల్సి వస్తోందని అన్నారు. ఈ అంశంపై తక్షణమే పార్లమెంటులో చర్చ జరగాలని, బాధితులకు న్యాయం చేసేలా కొత్త చట్టాలను తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
మలివాల్ లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సామాన్య ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఇన్సూరెన్స్ రంగంలో సంస్కరణలు రాకపోతే భవిష్యత్తులో సామాన్యుడికి వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడిన సొమ్ముతో ఇన్సూరెన్స్ కొని సమయానికి అనేక సాకులతో క్లెయిమ్స్ రిజెక్ట్ కావటం, ఆసుపత్రులు అధికంగా బిల్లులు వేసి పేషెంట్ల పాలసీ లిమిట్స్ అవగొట్టడం అరికట్టాలని ఆప్ ఎంపీ మోడీ ప్రభుత్వాన్ని రాజ్యసభలో ప్రసంగిస్తూ కోరారు.
