
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆధునిక టెక్నాలజీని జోడించాలని, మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం (జులై 01) ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు.
క్రీడాభివృద్ధికి టెక్నాలజీని వాడుకొని ప్రతి క్రీడాకారుడి వివరాలు, పోటీల సమాచారాన్ని ఒక డేటా బ్యాంకులో భద్రపరచాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన కొత్త స్పోర్ట్స్ పాలసీని అమలు చేయడంలో శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి, మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా స్పోర్ట్స్ అథారిటీ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఇకపై ప్రతి నెలా క్రీడా శాఖపై నిరంతర సమీక్షా సమావేశాలు జరుగుతాయన్నారు. శాట్జ్ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ క్రీడా శాఖకు ఇచ్చిన చారిత్రాత్మక బడ్జెట్‌తో పాటు గత ఏడాది కాలంలోనే అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో శాట్జ్ వీసీ ఎండీ సోనీ బాలాదేవితో ఇతర అధికారులు పాల్గొన్నారు.