దేశంలో భారీగా పెరిగిన ఐటీ నిరుద్యోగులు.. అర్హత ఉన్నా జాబ్ ఓపెనింగ్స్ నిల్..!

దేశంలో భారీగా పెరిగిన ఐటీ నిరుద్యోగులు.. అర్హత ఉన్నా జాబ్ ఓపెనింగ్స్ నిల్..!

భారతీయ ఐటి రంగం ప్రస్తుతం మార్పుల తుఫాన్‌లో చిక్కుకుంది. పెద్ద టెక్ దిగ్గజాల నుంచి మధ్యస్థాయి ఐటీ సేవల కంపెనీల వరకు అన్నీ గతంలో లాగా క్యాంపస్ హైరింగ్స్‌కి ఆసక్తి చూపడం తగ్గించాయి. కంపెనీలు ప్రస్తుతం ఏఐ, క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ వంటి ఆధునిక డిజిటల్ నైపుణ్యాలున్న అభ్యర్థుల నియామకాలపైనే తమ దృష్టిని కొనసాగిస్తున్నాయని తేలింది.

ఐటి రంగంలో ఉద్యోగాల వృద్ధిరేటు 1.8 శాతానికి మాత్రమే పరిమితమైందని హైరింగ్‌ ప్లాట్ఫారమ్‌ "ఇన్‌స్టాహైర్‌" డేటా వెల్లడించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 6.4 శాతం ఉన్న పట్టణ నిరుద్యోగం.. 2025 అక్టోబర్‌ నాటికి 7.2 శాతానికి పెరిగి ఏకంగా నాలుగేళ్ల అత్యధిక స్థాయిలకు చేరుకుంది. దీంతో టెక్ రంగం నిరుద్యోగిత గతంలో చూడని స్థాయిలకు చేరుకున్నట్లు వెల్లడైంది. 

ఐటీ కంపెనీలు డీల్స్ మందగించటంతో పాటు లాభాలపై పెరిగిన ఒత్తిడి కారణంగా 24 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ఇన్‌స్టాహైర్‌ సహ వ్యవస్థాపకుడు సర్బోజిత్‌ మాలిక్‌ చెప్పారు. ఇక మరో 40 శాతం కంపెనీలు క్లౌడ్ మైగ్రేషన్‌, సైబర్‌ సెక్యూరిటీ, జనరేటివ్‌ AI సంబంధిత టాలెంట్ రిక్రూట్మెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని చెప్పారు. 

దేశంలోని మధ్యస్థాయి ఐటీ కంపెనీలైన.. కొఫొర్జ్‌, హెక్సావేర్‌, కేపీఐటీ, ఎల్పిటీఐ మైండ్‌ట్రీ వంటి సంస్థలలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొఫొర్జ్‌ గత ఏడాది రెండో త్రైమాసికంలో 5,000 మందికి పైగా ఉద్యోగాలను కలిపి ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 709 మంది ఉద్యోగులకు పరిమితమైంది. మరోవైపు ఎంఫసిస్‌ వంటి సంస్థలు ఉద్యోగులను తగ్గించే దిశగా ముందుకు సాగుతున్నాయి. పెద్ద కంపెనీ టీసీఎస్‌ 19,755 ఉద్యోగాలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల్లో 40 శాతం మంది ఉద్యోగానికి అర్హత కలిగి ఉన్నా.. వారిలో 15–20 శాతం మంది మాత్రమే ఐటీ రంగంలో జాబ్స్ పొందుతున్నట్లు టీమ్ లీజ్ డిజిటల్ సీఈవో చెప్పారు. 

ప్రస్తుతం ఐటీ రంగంలో కొనసాగుతున్న రిక్రూట్మెంట్స్ మందగమనం స్వల్ప కాలమేనని నిపుణులు అంటున్నారు. అయితే ఈ క్రమంలో అనవసరమైన జాబ్ రోల్స్ తొలగింపుతో పాటు ఏఐ, ఆటోమేషన్ జాబ్ కల్చర్ మార్చనుందని వారు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు తగ్గినప్పటికీ, సరైన నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాల ద్వారాలు ఎప్పటికీ మూతపడవని వారు సూచిస్తున్నారు. ఏఐతో పాటు కొత్త టెక్నాలజీలపై పరిజ్ఞానం ఉన్న టెక్కీలకు హై ప్యాకేజీలు ఇచ్చేందుకు కూడా కంపెనీలు వెనుకూడని పరిస్థితులను యువత వినియోగించుకోవాలని నిపుణులు అంటున్నారు.