అక్టోబర్ నెలలో దేశంలోని హోల్‌సేల్ ధరల సూచీ 27 నెలల కనిష్ఠ స్థాయి అయిన మైనస్ 1.21 శాతానికి పడిపోయింది. ప్రధానంగా పప్పులు, కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడంతో పాటు.. ఇంధన, తయారీ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గడం దీని కారణమని ప్రభుత్వ డేటా వెల్లడించింది.
సెప్టెంబర్‌లో WPI ద్రవ్యోల్బణం 0.13 శాతం కాగా.. గత సంవత్సరం అదే నెలలో 2.75 శాతం నమోదైంది. ఈసారి ఆహార పదార్థాల ధరలు 8.31 శాతం తక్కువ కావటంతో ఇది సెప్టెంబర్‌లో నమోదైన 5.22 శాతం కంటే ఎక్కువ తగ్గుదలను చూసింది. కూరగాయల విభాగంలో మాత్రం భారీ పతనం చోటుచేసుకుంది. అక్టోబర్‌లో పప్పుల ధరలు 16.50 శాతం, బంగాళాదుంపల్లో 39.88 శాతం, ఉల్లిపాయల్లో 65.43 శాతం రేట్ల తగ్గుదల నమోదైంది.
తయారీ రంగంలోని మ్యానుఫ్యాక్చర్డ్ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 1.54 శాతానికి క్షీణించగా.. ఎనర్జీ విభాగంలో వరుసగా ఏడో నెల కూడా నెగెటివ్ దిశ కొనసాగింది. 2026 ఆర్థిక సంవత్సరం మిగతా నెలల్లో కూడా బేస్ ఎఫెక్ట్ కారణంగా WPI స్థాయిలు డిఫ్లేషన్ పరిధిలోనే కొనసాగుతాయని ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ పరాస్ జస్రాయ్ అన్నారు. అయితే జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించటం కూడా ద్రవ్యోల్బణం తగ్గుదలకు మరో కారణంగా నిపుణులు సూచిస్తున్నారు. పన్ను తగ్గింపులు వినియోగదారుల ఖర్చులు తగ్గించడంలో.. ద్రవ్యోల్బణం నియంత్రణకు సహకరించాయని అంటున్నారు.
►ALSO READ | ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్.. 200MP కెమెరాతో ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్.. ఇండియాలో లాంచ్..?
వరుసగా తగ్గుతున్న ద్రవ్యోల్బణం బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపులపై ఆశలు పెంచుతున్నాయి. భారత ఆర్థిక వృద్ధి మందగమనంలోకి వెళ్లకుండా ఉండటానికి RBI 25-50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటు తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో స్థిరత్వం, ఆహార ధాన్యాల బఫర్ స్టాక్, మంచి ఖరీఫ్ పంట మెుత్తంగా ఈ పరిస్థితులకు కారణాలుగా ఉన్నాయని తేలింది.
