- అమెరికాతో ఒప్పందంతో పత్తి రైతులు, టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్టర్లకు తీవ్ర నష్టం
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో దేశంలోని పత్తి రైతులు, టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్టర్లను మోసం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం ఆ రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో రాహుల్ గాంధీ.. రైతు సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, ఈ అంశంపై శనివారం రాహుల్ గాంధీ ఎక్స్ లో ‘18 శాతం టారిఫ్ వర్సెస్ 0 శాతం’ అనే శీర్షికతో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో.. "ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గం భారత్, -అమెరికా వాణిజ్య ఒప్పందంపై గందరగోళం సృష్టిస్తున్నారు. అమెరికా భారతీయ గార్మెంట్స్ (వస్త్రాలు) ఎగుమతులపై 18 శాతం టారిఫ్ విధించింది. కానీ, బంగ్లాదేశ్‌కు అదే గార్మెంట్స్ ఎగుమతులపై 0 శాతం టారిఫ్ (సున్నా డ్యూటీ) ఇచ్చింది.
దానికి ఏకైక షరతు.. అమెరికన్ పత్తి దిగుమతి చేసుకోవాలి. పార్లమెంటులో ఈ అంశం లేవనెత్తగా.. ‘మనకూ అదే ప్రయోజనం కావాలంటే అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాలి’ అని మంత్రి గోయల్సమాధానం ఇచ్చారు. ఇది ‘ముందు బావి, వెనక గొయ్యి’ లాంటి పరిస్థితి. అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటే భారతీయ పత్తి రైతులు నాశనం అవుతారు. దిగుమతి చేసుకోకపోతే భారత టెక్స్‌టైల్ పరిశ్రమ వెనుకబడుతుంది. పత్తి సాగు భారతదేశ జీవనోపాధికి వెన్నెముక. కోట్లాది కుటుంబాలు ఈ రంగాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ రంగాలపై దాడి చేయడం అంటే మిలియన్ల కుటుంబాలను నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే" అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
