- తాజా మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతకు వినతి
ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుకునే విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ‘ఇందిరమ్మ అల్పాహార క్యాంటీన్’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర నాయకుడు డి. సలీమ్ ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని క్యాంపు కార్యాలయంలో తాజా మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఈ క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. దీనిపై స్పందించిన శ్రీలతాశోభన్ రెడ్డి.. ఒక వారంలోగా క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
