- గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: నుమాయిష్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్(నుమాయిష్ ) మైదానంలో శనివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నుమాయిష్ రాష్ట్రానికి తలమానికంగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో జరుగుతున్నదన్నారు. తాను చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచి కూడా ఈ నుమయిష్ చూస్తున్నానని, అప్పట్లో ప్రతియేటా వచ్చేవాడినని తెలిపారు.
నిరుపేదలకు ఈ నుమాయిష్ ద్వారా లాభం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆడపిల్లల విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్న సొసైటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం ఎప్పటికి ఇలాగే కొనసాగాలని కోరుతున్నట్లు తెలిపారు. 1995లో డైరీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఇక్కడ నేను ప్రారంభించిన స్టాల్ నేటికి కొనసాగుతున్నదన్నారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇప్పటికీ ఉండటానికి గతంలో ప్రెసిడెంట్ గా పనిచేసిన దివంగత మాధవరెడ్డి కారమణమన్నారు. ఆయన చొరవతో గ్రౌండ్ ఇతరులకు అప్పగించకుండా ఉందన్నారు. అనంతరం సొసైటీ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత నుమాయిష్ సొసైటీ కి అనుబంధంగా నడుస్తున్న విద్యాసంస్థల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు.
