బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందని అన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం విజయం సాధించిందని అన్నారు. విజయంతో ఆశీర్వదించిన బీహార్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు మోడీ.
బీహార్ తీర్పు నూతన సంకల్పంతో పని చేయడానికి శక్తినిచ్చిందని... అవిశ్రాంతంగా పని చేసిన ప్రతి ఎన్డీయే కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలను తమ కార్యకర్తలు తిప్పికొట్టారని అన్నారు మోడీ. బీహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టారని అన్నారు. MY ఫార్ములా అంటే.. మహిళ -యూత్ ఫార్ములా అని అన్నారు మోడీ. బీహార్‌లో ఇవాళ ప్రతీ ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారని అన్నారు మోడీ.
బీహార్‌లో జంగిల్‌రాజ్ అన్నప్పుడల్లా ఆర్జేడీ నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేదని... ఆ జంగిల్‌రాజ్ ఎప్పటికీ తిరిగిరాదని అన్నారు. బీహార్ ప్రజలు వికసిత్ భారత్‌కు ఓటేశారని... బీహార్‌లో ఎన్డీయే అతిపెద్ద విజయం సాధించిందని అన్నారు. జంగిల్‌రాజ్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసని... జంగిల్‌రాజ్‌లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలకు అనుభవమేనని అన్నారు మోడీ. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని అన్నారు మోడీ.
ఒకప్పుడు బీహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేదని... అరాచక శక్తుల కారణంగా ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసిపోయేవని అన్నారు. కానీ ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా, ధైర్యంగా వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొన్నారని.. జంగిల్‌రాజ్ పోవడంతోనే ఇది సాధ్యమైందని అన్నారు మోడీ.
