బీసీలకు బీజేపీ ద్రోహం..రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకుండా మోసం చేసింది: జాజుల

బీసీలకు బీజేపీ ద్రోహం..రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకుండా మోసం చేసింది: జాజుల
  • బీజేపీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ

హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వకుండా ఆ పార్టీ తీవ్ర ద్రోహం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని చివరి వరకు ఊరించి మోసం చేశారన్నారు. బీసీలను కాదని ఒక శాతం ఉన్న అగ్రకుల సామాజిక వర్గానికి పార్టీ అధ్యక్ష కట్టబెట్టి బీసీలను దగా చేసిందన్నారు. సోమవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్ లో జాజుల మాట్లాడారు.

రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు అవకాశాలు ఇస్తుంటే.. బీజేపీ అగ్రకులాల జపం చేస్తున్నదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. గత ఎన్నికల్లో పార్టీ గెలిస్తే బీసీ సీఎం అని ప్రకటించి ఎన్నికల ఫలితాల తరువాత అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి ఓసీ ఎమ్మెల్యే కు ఇచ్చి బీసీలను మోసం చేశారని జాజుల గుర్తు చేశారు. దీన్ని బట్టి బీజేపీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు. ఇది అధ్యక్ష పదవి విషయంలో మరోసారి రుజువైందన్నారు.

పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వని పార్టీ, రేపు భవిష్యత్తులో బీసీనీ సీఎం చేస్తానంటే బీజేపీని బీసీలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపకుండా గత మూడు నెలలుగా తొక్కి పెడుతున్నదని, ఇప్పుడు  బీసీలకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వకుండా బీజేపీ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని జాజుల మండిపడ్డారు.

తెలంగాణ బీజేపీ బ్రాహ్మణ జనతా పార్టీ అని అర్థమయిందన్నారు. బీజేపీ అగ్రకులాలకు ఉన్న విలువ బీసీలకు లేదని ఈ నియామకంతో తేలిపోయిందన్నారు. పార్టీలో ఎంతోమంది బీసీలు పార్టీ అధ్యక్ష పదవికి అర్హులు ఉన్నప్పటికీ, వారికి బీసీ కులమే అనర్హతగా మారిందన్నారు. ఈ సమావేశంలో నేతలు గణేష్ చారి, మనిముంజరి, మల్లికార్జున్ యాదవ్, పానుగంటి విజయ్ పాల్గొన్నారు.