
దసరా పండగ వచ్చేస్తోంది.. దేవి నవరాత్రుల కోసం ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. వాడవాడలా దేవి నవరాత్రులు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. దసరా అంటే దేవి నవరాత్రుల సందడితో పాటు స్కూల్ హాలిడేస్ కూడా గుర్తొస్తాయి. పదిరోజుల పాటు స్కూల్ సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లలు దసరా పండుగ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం స్కూల్ పిల్లలు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పింది. దసరా సెలవులను మరో మూడు రోజులు పెంచింది ఏపీ సర్కార్. మొదట సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు లోకేష్. ఈ క్రమంలో ఉపాధ్యాయుల కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఈ క్రమంలో దసరా పండుగకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు మంత్రి లోకేష్. ప్రభుత్వం తాజా నిర్ణయంతో దసరా పండుగకు 12 రోజులు రానున్నాయని అన్నారు. కాగా, అంతకు ముందు స్కూళ్లకు దసరా పండుగ సెలవులను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 9 రోజులు ప్రకటించింది ప్రభుత్వం.
అయితే.. దసరా సెలవుల విషయంలో పునరాలోచించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు స్పందించిన ప్రభుత్వం దసరా సెలవులు మరో మూడు రోజులు పెంచుతూ 9 రోజుల సెలవులను కాస్తా 12 రోజులుగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.