
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు నమ్మిన వాళ్లనే మోసం చేస్తున్నారు. అప్పటి వరకు ఉన్న పరిచయం, నమ్మకాన్ని వమ్ము చేస్తూ దొరికినంత వరకు దోచుకుంటున్నారు. అలాంటిదే ఈ ఘటన. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువైన డైమండ్ జ్యువెలరీని మాయం చేశాడు ఓ వ్యక్తి. ముంబైలో జరిగిన ఈ మోసం చర్చనీయాంశంగా మారింది.
ముంబై పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. షీల్ కోర్డియా (21) అనే గుజరాత్ సూరత్ కు చెందిన వ్యాపారి.. వారసత్వంగా వచ్చిన వజ్రాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కోసం వివిధ నగరాలకు వెళ్లి వస్తుంటాడు. ముంబైకి చెందిన రెగ్యులర్ కస్టమర్ చైతన్య మెహతా.. రూ.3 కోట్ల వివులైన 666.65 క్యారెట్ల డైమండ్ జ్యువెలరీ ఆర్డర్ చేశాడు.
జ్యువెలరీ తీసుకొచ్చేందుకు తన అనుచరులైన జిమిత్, రకిన్ లను గుజరాత్ కు పంపాడు. సెప్టెంబర్ 6 న కోర్డియా కంపెనీకి వెళ్లి ఆభరణాలను తీసుకున్నారు. అయితే జ్యువెలరీని ట్రాన్స్ పోర్ట్ చేయాలని విక్రమ్ సంఘ్వీ అనే నమ్మకస్తుడికి చెప్పాడు కోర్డియా. ఓనర్ చెప్పినట్లుగా సంఘ్వీకి జ్యువెలరీని అప్పజెప్పారు జిమిత్, రకిన్ లు. వచ్చే దారిలో నవ్ సరీ రైల్వే స్టేషన్ లో వాళ్ల కళ్లుగప్పి సంఘ్వీ ఎస్కేప్ అయ్యాడు.
దీంతో బోరివలీ పోలీస్ స్టేషన్ లో ఫర్యాదు చేశాడు కోర్డియా. విక్రమ్ సంఘ్వీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నమ్మకస్తులే ఇలా చేయడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని.. తన కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాడు ఆ వజ్రాల వ్యాపారీ కోర్డియా.