OG Movie: పవన్‌ కళ్యాణ్ ‘ఓజీ’ సునామీ.. ‘వాషి యో వాషి’ హైకూతో అదరగొట్టిన పవర్ స్టార్!

OG Movie: పవన్‌ కళ్యాణ్ ‘ఓజీ’ సునామీ.. ‘వాషి యో వాషి’ హైకూతో అదరగొట్టిన పవర్ స్టార్!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాక్షన్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం ‘ఓజీ’ (OG). దర్శకుడు సుజీత్‌ తెరకెక్కించిన ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పేలా ఒక్కో అప్‌డేట్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.  రేపు ఆదివారం ( సెప్టెంబర్ 21న  ) ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మూవీ మేకర్స్ సరికొత్త ప్రమోషన్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రైండ్ లో ఉంది.

‘వాషి యో వాషి’ హైకూతో అదరగొట్టిన పవన్!

ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ ‘ఓజాస్‌ గంభీర’ అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఓ ప్రచార వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోలో పవన్‌ కల్యాణ్‌ విలన్‌ ఇమ్రాన్‌ హష్మీ (ఓమీ)కి వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగ్, ఆ తర్వాత చెప్పిన జపనీస్‌ హైకూ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. “ఓమీ.. మై డియర్‌ ఓమీ.. ఎగిరెగిరి పడుతున్నావ్‌.. నీలాంటి వాడిని నేలకెలా దించాలో నాకు తెలుసు” అంటూ తెలుగులో మొదలుపెట్టి.. ఆ తర్వాత జపనీస్‌లో “వాషి యో వాషి” అని ముగించడం అభిమానులను అలరించింది. ఈ హైకూ పవన్‌ పాత్రలోని స్టైలిష్‌ అగ్రెషన్‌ను సూచిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

‘డెత్ కోట’కు స్వాగతం..  ట్రైలర్‌కు టైం ఫిక్స్

సినిమాకు మరో అత్యంత కీలకమైన అప్‌డేట్‌ను చిత్రబృందం లేటెస్ట్ గా విడుదల చేసింది. సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ‘ఓజీ’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌పై “డెత్ కోట.. కన్ఫర్మ్” అనే క్యాప్షన్‌ మరింత ఉత్సుకతను పెంచింది. ఈ ట్రైలర్‌లో పవన్‌ కల్యాణ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, డైలాగ్స్‌ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకు విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్‌లు చూస్తే, సుజీత్‌ పవన్‌ను స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా చూపించారని స్పష్టమవుతోంది.

 

బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపుతో రికార్డులు!


పవన్ కల్యాణ్ అభిమానుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతిని మంజూరు చేశాయి.  ఈ నెల 25న తెల్లవారుజామున 1 గంటకు బెనిఫిట్‌ షో ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం  అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ1000 వరకు విక్రయించేందుకు వీలు కల్పించింది. అలాగే, విడుదల రోజు నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇక తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.800కు విక్రయించుకోవచ్చని ప్రకటించింది. అంతేకాకుండా, విడుదల రోజు నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.  ఇప్పటికే యూఎస్ లో రికార్డు స్థాయి టికెట్‌ సెల్ అయ్యాయి. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచిన ధరలతో ప్రీమియర్లు, బెనిఫిట్‌ షోలకు అనుమతులు లభించడంతో 'ఓజీ' ఒక సునామీలా రాబోతోందన్న భావన అభిమానుల్లో నెలకొంది..

 

ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ నటించగా, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ఓమీ అనే విలన్‌ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్‌, నేపథ్య సంగీతంలో సరికొత్త ఒరవడిని సృష్టించారని తెలుస్తోంది. లండన్‌లోని ఒక ప్రఖ్యాత స్టూడియోలో ఏకంగా 117 మంది సంగీత కళాకారులతో కలిసి పనిచేయడంతో పాటు, జపాన్‌ వాయిద్య పరికరం 'కోటో'ను ఉపయోగించి కొన్ని సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ క్రియేట్‌ చేశారు. ఇవన్నీ సినిమాను విజువల్‌గా, ఆడియోగా ఉన్నత స్థాయిలో నిలబెడతాయని భావిస్తున్నారు.  ఈ నెల 25న థియేటర్ల వద్ద అభిమానుల సందడి అసాధారణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.