
- ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు గుర్తింపు
- నేడూ సోదాలు కొనసాగే అవకాశం
హైదరాబాద్, వెలుగు: జువెల్లరీ వ్యాపారులపై ఇన్‌కమ్‌ట్యాక్స్ (ఐటీ) డిపార్ట్‌మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్‌సంస్థ వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అనుబంధ సంస్థలైన క్యాప్స్‌గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్‌లో సహా మరికొన్ని జువెల్లరీ షాపుల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు రోజుల సెర్చ్ వారెంట్‌తో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు.. శుక్రవారం కూడా తనిఖీలు చేశారు. ఐదేండ్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌తో పాటు బంగారం అమ్మకాలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు గుర్తించినట్టు తెలిసింది. బిల్స్ లేకుండా పెద్ద మొత్తంలో బంగారం అమ్మకాలు జరిగినట్టు ఐటీ విచారణలో వెల్లడైనట్టు సమాచారం.
ఐటీ చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసం గుర్తించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పన్నుల చెల్లింపులు, బంగారం క్రయ విక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్టర్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు శనివారం కూడా కొనసాగే సూచనలున్నాయి. బంజారాహిల్స్, అబిడ్స్ కేంద్రంగా క్యాప్స్‌గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్ ఆఫీసులు, వాసవి గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఎండీ చందా శ్రీనివాస్ రావు సహా క్యాప్స్‌గోల్డ్, కలశ ఫైన్ జ్వెల్స్ డైరెక్టర్లు చందా అభిషేక్, చందా సుధీర్, సౌమ్య ఇండ్లలో మూడు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి.
మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసిన గోల్డ్‌ను హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, విజయవాడ, వరంగల్‌లోని కార్పొరేట్‌ఆఫీసులు, హోల్‌సేల్, రిటైల్ షాపులకు తరలిస్తున్నట్టు ఐటీ గుర్తించింది. ఈ క్రమంలో ట్యాక్స్‌లు తప్పించుకునేందుకు నగదు రూపంలో లావాదేవీలు జరుపుతున్నట్టు ఐటీ దృష్టికి వచ్చింది. బంగారం ధరలు రూ. లక్షకు చేరిన తరువాత రెండేండ్లుగా ఐటీ చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు ఐటీ గుర్తించిట్లు సమాచారం.