వరికొయ్యలు కాల్చి వేస్తే నష్టాలే..పొలంలో కలిపి దున్నితే లాభం:వ్యవసాయాధికారులు

వరికొయ్యలు  కాల్చి వేస్తే నష్టాలే..పొలంలో కలిపి దున్నితే లాభం:వ్యవసాయాధికారులు
  • వాయు కాలుష్యం.. రైతులకు ఊపరితిత్తుల సమస్య
  • భూసారానికి ముప్పు.. నశిస్తున్న సూక్ష్మజీవులు, పోషకాలు

యాదాద్రి, వెలుగు: వరి కొయ్యలు కాల్చవద్దని ప్రతీ సీజన్​లో అగ్రికల్చర్​ఆఫీసర్లు చెబుతున్నా.. కొందరు రైతులు వినడం లేదు. వరి కోతలు ముగిసి కర్రలు ఎండిపోయిన తర్వాత కలియ దున్నకుండా కాల్చి వేస్తున్నారు. దీనివల్ల వాయుకాలుష్యం ఏర్పడుతోంది. భూసారానికి ముప్పు కలుగుతుంది. రైతులకు ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడి అనారోగ్యానికి దారి తీస్తోంది. 

కొయ్యలు కాల్చి వేస్తే నష్టాలే

యాసంగి సీజన్​ ప్రారంభమైంది. కొందరు రైతులు ఇప్పుడిప్పుడే దున్నడం ప్రారంభించగా, మరికొందరు నాట్లు కూడా వేసేస్తున్నారు. దున్నడానికి ముందు కొందరు రైతులు వరి కొయ్యలు మురిగిపోయేందుకు ఎన్​ఎస్​పీ వాడుతుంటే, మరికొందరు కొయ్యలను కాల్చేస్తున్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతోందని రైతులు భావిస్తున్నారు. దీనివల్ల రైతులకు లాభం కన్నా నష్టమే ఎక్కువని ఆఫీసర్లు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.

 కొయ్యలను కాలిస్తే వాయు కాలుష్యం ఏర్పడడంతోపాటు .. పొగతో రైతులు ఊపరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. పొగ కారణంగా ఊపిరి ఆడకుండా గతంలో పలువురు రైతులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కాల్చడం వల్ల వచ్చే వేడి పంటల దిగుబడిపై కూడా ప్రభావం చూపుతుందని, నేలలోని నత్రజని, ఫాస్ఫ రస్, పొటాషియం వంటి పోషకాలు ఆవిరైపోతాయని ఆఫీసర్లు చెప్తున్నారు.పంటలకు ఉపయోగపడే సూక్ష్మ జీవులు నాశనమై భూమి సమతుల్యత కోల్పోతుందని వివరిస్తున్నారు. నేలలో తేమ శాతం తగ్గిపోయి నీటి నిల్వ సామర్ధ్యం దెబ్బతింటుంది. 

వరి కొయ్యలతో కలియ దున్నితే లాభాలే

వరి కొయ్యలను అలానే ఉంచి పొలంలో కలియదున్నితే నేలలో పోషకాలు పెరుగుతాయి. సేంద్రియ కర్బన శాతం పెరిగి నేలసారం మరింత పెరుగుతుంది. వరి కోతల అనంతరం కొయ్యలను కుళ్లిపోయేలా చేస్తే పంటలకు సేంద్రీయ ఎరువుగా పని చేస్తోంది. ఎకరం పొలానికి 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌(ఎస్​ఎస్​పీ) చల్లి కలియదున్నితే వరి కొయ్యలు మురిగి నేల సారవంతమవుతుంది. 

అదే విధంగా వరి గడ్డిని సేంద్రీయ ఎరువుగా మార్చుకోవచ్చని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. కోతల అనంతరం చేనులో ఉండే పంటల అవశేషాలతో నేలలో సారం పెరగుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. 

మిత్ర జీవులు నాశనమవుతాయి

వరి కొయ్యలను కాల్చడం వల్ల పంటలకు ఉపయోగపడే మిత్ర జీవులు నాశనం అవుతాయి. అవి పొలంలోనే మురిగే విధంగా చేస్తే పంటలకు లాభదాయకంగా ఉంటోంది. భూసారం పెరిగి పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. - వెంకట రమణారెడ్డి​, డీఏవో, యాదాద్రి