- నిజాంసాగర్ కింద లక్షా 25 వేల ఎకరాలకు నీటి విడుదల
- పోచారం, కౌలాస్ ప్రాజెక్టుల కింద 19వేల ఎకరాలు సాగు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో యాసంగి సాగుకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. దీంతో ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఒక విడత నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు కింద కామారెడ్డి జిల్లాలో 30 వేల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 95 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
పోచారం, కౌలాస్ ప్రాజెక్టుల కింద సుమారు 19 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రాజెక్టులు, చెరువుల కింద లక్షా 30 వేల ఎకరాల వరకు వరి సాగయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టులు, చెరువుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో పాటు భూగర్భజలాలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వలు
నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వరి నారు పోసే దశ నుంచి పంట కోతకొచ్చే వరకు ఆరు తడులు అందించనున్నారు. అవసరమైతే ఏడో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. యాసంగికి సుమారు 12 టీఎంసీల నీటిని వినియోగించనుండగా, ప్రాజెక్టులో ఇంకా 5 టీఎంసీల వరకు నీటి నిల్వలు మిగలనున్నాయి.
వచ్చే వానాకాలం ఆలస్యంగా వర్షాలు కురిసినా ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఒకటి, రెండు తడులు అందించే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండటంతో రైతులు నిశ్చింతగా సాగు పనులు చేపడుతున్నారు.
పోచారం ప్రాజెక్టు కింద 10,500 ఎకరాలకు సాగునీరు
పోచారం ప్రాజెక్టు కింద 10,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1.8 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉంది. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారం నుంచి పది రోజుల్లోపు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీటి ద్వారా నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల్లోని పొలాలకు సాగునీరు అందనుంది.
కౌలాస్ ప్రాజెక్టు కింద 75 వేల ఎకరాలకు నీటి సరఫరా
జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు ద్వారా 9 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం ఉంది. జిల్లావ్యాప్తంగా 1,515 చెరువులు, కుంటలు ఉండగా, వాటిలో చాలా వరకు ప్రస్తుతం నీటితో నిండి ఉన్నాయి. ఈ చెరువుల ఆధారంగా సుమారు 75 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్ల పరిధిలోని అనేక మండలాల్లో సాగుకు చెరువుల నీళ్లే ఆధారం.
