హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర డ్యామ్ గేట్లకు అధికారులు రిపేర్లు మొదలుపెట్టారు. తుంగభద్ర బోర్డు నేతృత్వంలో గేట్ల రిపేర్ల పనులు నడుస్తున్నాయి. తొలుత 18వ గేట్‌ను అమర్చనున్నారు. నెలకు 8 గేట్లను అమర్చేలా అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. 2024 ఆగస్టులో వచ్చిన వరదలకు డ్యామ్ 18వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆ తర్వాత ఇతర గేట్ల పనితీరును అంచనా వేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఏకే బజాజ్ నేతృత్వంలో సాంకేతిక నిపుణుల కమిటీని నియమించింది.
డ్యామ్‌ను పరిశీలించిన కమిటీ.. 33 గేట్లను మార్చాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 2026 జూన్ నాటికి ఆ గేట్లకు రిపేర్లను పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది. తాజాగా రిపేర్లను మొదలుపెట్టింది. 18, 20, 24 గేట్లకు సంబంధించి ప్లేట్లను అధికారులు ఇప్పటికే తొలగించారు. 4, 11, 27, 28 ప్లేట్ల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ స్థాయి 54 టీఎంసీలు ఉండగా, 40 టీఎంసీలకు నీటి మట్టం చేరుకోగానే పూర్తిస్థాయిలో రిపేర్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
