జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : ఇన్చార్జ్మంత్రి జూపల్లి కృష్ణారావు

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : ఇన్చార్జ్మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     ఇన్​చార్జ్​మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. పట్టణంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్​ సర్పంచ్​లను సన్మానించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలని వారికి సూచించారు. 

గ్రామాల అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, గ్రంథాలయ చైర్మన్​నర్సయ్య, డీసీసీ అధ్యక్షుడు నరేశ్​ జాదవ్, ఆత్రం సుగుణ, బోథ్ ​నియోజకవర్గ ఇన్​చార్జ్ ఆడె గజేందర్, కిసాన్​ కాంగ్రెస్ ​రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్​ రెడ్డి, సీనియర్​ నేతలు గండ్రత్​ సుజాత, సాజిద్​ ఖాన్​తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

నేరడిగొండ, వెలుగు: రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేరడిగొండలోని మార్కెట్ యార్డ్ ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో పంటలు అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన సోయాబీన్ ను మార్కెట్ కు తీసుకొస్తే రంగు మారిందని, పాడయ్యాయని కారణాలు చెబుతూ ఆఫీసర్లు తిరిగి పంపిస్తున్నారని, పంటను ఎలా అమ్ముకోవాలని రైతులు మంత్రి వద్ద వాపోయారు. 

స్పందించిన ఆయన రైతులెవరూ బాధపడాల్సిన అవసరం లేదని, పండించిన మొత్తం పంటను కొనేలా చూస్తానని, అధైర్య పడవద్దన్నారు. వాపస్ వచ్చిన సోయాబీన్ సాంపిల్స్​ను ఆఫీసర్లకు చూయించేందుకు తన వెంట తీసుకెళ్లారు. సోయాబీన్ కొనుగోళ్లలో ఇబ్బందులను తొలగించేందుకు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు.