- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్
కాగజ్ నగర్, వెలుగు: కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారంకాగజ్నగర్లోని తెలంగాణ తల్లి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఇవ్వాల్సిన నిధులను 60 శాతానికి కుదిస్తూ రాష్ట్రాలు 40 శాతం నిధులు ఇవ్వాలని చట్టాన్ని మార్చడం దారుణమన్నారు.
వీబి-జీ-రాం-జీ పథకం పేరుతో కూలీలకు నష్టం చేసేలా బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె.రాజేందర్, జిల్లా సహాయక కార్యదర్శి కృష్ణమాచారి, జిల్లా నేత ఎం.శ్రీనివాస్, సీపీఎం నేత రాజన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్ కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ తదితరులు పాల్గొన్నారు.
