శ్రీరాంపూర్ ఓసీపీలో కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

శ్రీరాంపూర్ ఓసీపీలో కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
  • పెండింగ్​ జీతాలు చెల్లించాలని ఆందోళన
  • కోల్ ​డోజర్ల అడ్డగింత 

నస్పూర్, వెలుగు: పెండింగ్​ వేతనాలు చెల్లించాలని శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓపెన్​ కాస్ట్ ​గనిలోని సీఆర్ఆర్​ఓబీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సింగరేణి సంస్థ కోల్​ రవాణా చేసే డోజర్లను అడ్డుకొని నిరసన తెలిపారు. కాంట్రాక్ట్​ కార్మికుల ఆందోళనతో ఓవర్​బర్డెన్​ వెలికితీత, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తమ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేస్తూ ఓసీపీ ఓబీ క్యాంపు ఆఫీస్ ఆవరణలో వంటావార్పు నిర్వహించారు. 

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. సీఆర్ఆర్​ఓబీ కంపెనీలో 900 మంది కాంట్రాక్ట్​ కార్మికులు పనిచేస్తున్నారని, గడిచిన నాలుగు నెలలుగా కంపెనీ యాజమాన్యం వేతనాలు చెల్లించడంలేదన్నారు. జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యను తీర్చడంలేదని, వెంటనే పెండింగ్​ వేతనాలు ఇప్పించాలని డిమాండ్​ చేశారు. వారికి సింగరేణి కాంట్రాక్ట్ ​కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు మద్దతు పలికారు.