Non Veg Pickle Recipe : చికెన్, రొయ్యల పచ్చళ్లు.. దసరా సెలవుల్లో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Non Veg Pickle Recipe : చికెన్, రొయ్యల పచ్చళ్లు.. దసరా సెలవుల్లో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

వేడి వేడి అన్నంలో ఎర్రని పచ్చడి కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు. చుట్టూ ఎన్నిరకాల కూరలున్నా మొదట.. పచ్చడి ముద్ద తినందే నోరు ఊరుకోదు. ఇక ఇష్టమైన నాన్వెజ్ పచ్చళ్లు అన్నంతో పాటే ఉంటే.. ఎంత ఇష్టంగా మొదటి ముద్ద పెట్టుకుంటారో.. పూర్తిగా తిన్నాక కూడా అంతే హ్యాపీగా ఫీలవుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నాన్​ వెజ్​ పచ్చళ్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. 

చికెన్ పచ్చడి 

కావాల్సినవి:

  • బోన్ లెస్ చికెన్: అరకిలో
  • అల్లంఎల్లిగడ్డ పేస్ట్: 4 టీ స్పూన్లు
  • గరం మసాలా: 4 టీ స్పూన్లు
  • ధనియాల పొడి: 4 టీ స్పూన్లు
  • ఆవపిండి: 4 టీ స్పూన్లు
  • ఉప్పు: తగినంత
  • పచ్చి కారం: ఒక కప్పు
  • నిమ్మకాయలు: 6

తయారీ విధానం:

చికెన్ పసుపు, ఉప్పు వేసి ఒకసారి నీటితో శుభ్రంగా కడగాలి. ఈ చికెన్ నన్ను ఒక మెత్తని గుడ్డలో చుట్టి ముడివేయాలి. ఐదు నిమిషాలకు కాస్త డ్రై గా అవుతుంది.ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టి అందులో ముక్కలు మునిగేంత నూనె పోసి బాగా వేడి చేయాలి.

ఇప్పుడు చికెన్ ముక్కలను గిన్నె సైజు బట్టి కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలన్నిటిని ఎర్రగా వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసి..పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మంట బాగా తగ్గించి మరిగిన నూనెలో మొదట అల్లంఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అది కాస్త రంగు మారుతున్నప్పుడు అందులో చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి. మసాలా పొడి, ఆవాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లార్చాలి. చల్లగా అయిన తర్వాత నిమ్మరసాన్ని పచ్చడిలో వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే పోపు పెట్టొచ్చు లేదంటే లేదు.

రొయ్యల పచ్చడి

కావాల్సినవి:

  • టైగర్ రొయ్యలు: అరకేజీ
  • వెల్లుల్లి: ఒకటి
  • ఉప్పు: తగినంత
  • కారం: ఒక కప్పు
  • మసాలా పొడి: 4 టీ స్పూన్లు
  • ధనియాల పొడి: 4 టీ స్పూన్లు
  • ఆవపిండి: 4 టీ స్పూన్లు
  • నూనె: 2 కప్పులు

తయారీ విధానం :

రొయ్యలను నూనెలో బాగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరిగిన నూనెలో ఎల్లిగడ్డ రెమ్మలు, కారం, మసాలా, ధనియాల పొడి, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో ఫ్రై చేసిన రొయ్యలు వేసి కలపాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసం వేసి మళ్లీ బాగా కలపాలి. ఆ తర్వాత పచ్చడికి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, ఎల్లిగడ్డ రెబ్బలతో పోప్ వేయాలి.