రాష్ట్రంలో రబీ సీజన్ కు సరిపడా యూరియా నిల్వలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం (డిసెంబర్ 29) ఫెర్టిలైజర్ (యూరియా) యాప్, యూరియా పంపణీలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. యూరియా సరఫరాలో ఇబ్బందులు రానీయవద్దంటూ ఆదేశించారు.
గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికంగా యూరియా అమ్మకాలు జరిగాయని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల చెప్పారు. 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫెర్టిలైజర్ యాప్ విజయవంతం అయినట్లు తెలిపారు. కేవలం 9 రోజుల్లో 2 లక్షల ఒక వెయ్యి 789 బస్తాల యూరియాను యాప్ ద్వారా రైతుల కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ఈ రబీకి కేంద్ర ప్రభుత్వం మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 5.70 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని వివరించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఈ సీజన్‌లో రోజుకు సగటుగా 8,692 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 3.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇది గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికం అని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు తెలిపారు.
ఫెర్టిలైజర్ యాప్ సక్సెస్:
వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ ను ఆదిలాబాద్, మహబూబ్ నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో డిసెంబర్ 20 నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఐదు జిల్లాల్లో 82 వేల 59 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసి 2 లక్షల వెయ్యి 789 యూరియా బస్తాలు కొనుగోలు చేశారు. యాప్ ప్రారంభించిన కేవలం 9 రోజుల్లోనే ఈ జిల్లాల్లో రోజుకు 22 వేలకు పైగా బస్తాలు పంపిణీ అయ్యాయని తెలిపారు.
►ALSO READ | అసెంబ్లీకి చేరిన కోతుల పంచాది.. ప్రభుత్వానికి స్పీకర్ కీలక సూచన
రాష్ట్రంలో యూరియా లభ్యతపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కమిషనరేట్ లో టోల్ ఫ్రీ నెం. 18005995779 ఏర్పాటు చేయడమైనదని తెలియజేశారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రెటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, కోఆపరేటీవ్ అడిషనల్ రిజిస్ట్రార్ చంద్రమోహన్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
