- రేవంత్ పాలనకు జనం జేజేలు పలుకుతున్నరు: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన 40 పేజీల చార్జిషీట్ లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెండేండ్ల పాలనపై తెలంగాణ ప్రజలు జేజేలు పలుకుతున్నారని.. ఇందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జనం సూపర్ హిట్ ఇవ్వడమే నిదర్శనమని పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో, దానికి ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ కు పట్టం కట్టారని.. దీన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన నేరాలపై జనం చార్జిషీట్ వేసి అసెంబ్లీ ఎన్నికల్లో వారికి జీవిత ఖైదు విధించారని ఎద్దేవా చేశారు. ప్రజలు విధించిన శిక్షకు కేసీఆర్ ఫామ్ హౌస్లో బందీ అయ్యారని ఆరోపించారు. ప్రజలు ఇన్ని శిక్షలు విధించినా బీఆర్ఎస్ నేతలు ఇంకా సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై చార్జిషీట్ అంటూ తిరుగుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
