ఇస్లామాబాద్: తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఆయనను టార్చర్ చేసి చంపేశారంటూ బలుచిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ నేతలు ట్వీట్లు చేయడం ఆయన మరణవార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు.
పీటీఐ నేతల నిరసనలతో పాకిస్తాన్లో హైటెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తలపై అడియాలా జైలు అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ మరణించారనే పుకార్లను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని.. వైద్య సంరక్షణ పొందుతున్నారని జైలు అధికారులు వివరణ ఇచ్చారు. అలాగే జైల్లో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులు, కొందరు రాజకీయ నాయకులకు ఒక రోజును నిర్ణయించారు.
పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా, ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, జాతీయ అసెంబ్లీ సభ్యుడు షాహిద్ ఖట్టక్, ప్రావిన్షియల్ మంత్రులు మీనా ఖాన్, షౌకత్ యూసఫ్‌జాయ్, ఇంతియాజ్ అలీ వారాయిచ్, హఫీజ్ ఫర్హాత్ కు జైల్లో ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు అనుమతి ఇచ్చారు. జైల్లో తన సోదరుడిని కలిసేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతో ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ దీక్షను విరమించారు. అడియాలా జైలు అధికారులు స్పందించడంతో ఇమ్రాన్ చనిపోయారనే ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది.
2023 నుంచి జైలులో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కొన్ని వారాల నుండి బయటికి కనిపించడం లేదు. భద్రతా కారణాలు చెబుతూ జైలు అధికారులు అతని కుటుంబీకులను కూడా కలవనివ్వడం లేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో చంపేశారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు అలీమా ఖాన్, నోరీన్ నియాజీ, డాక్టర్ ఉజ్మా ఖాన్‌తో పాటు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుదారులు అతన్ని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
కానీ జైలు అధికారులు ఒక నెలకు పైగా అనుమతిని నిరాకరిస్తూ వస్తున్నారు. చివరకు ఖైబర్-పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా కలవడానికి ప్రయత్నించినా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు పెరిగిపోయి పీటీఐ కార్యకర్తలు రోడ్డు ఎక్కడంతో పాక్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదంటూ అతడి మరణ పుకార్లపై అడియాలా జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు.
