ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓ ఇంటిలో అన్యమత ప్రచారం నిర్వహిస్తుండగా అక్కడికి హిందూ సంఘాల కార్యకర్తలు వెళ్లడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని బొంగ్లూర్ సప్తగిరి కాలనీలో ఓ ఇంట్లో ఓ మతానికి చెందిన వారు ప్రార్థనలు నిర్వహిస్తుండగా, అక్కడికి చేరుకున్న హిందూ వాహినీ సంఘాల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆదిబట్ల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, అక్కడ ఉన్న వారిని పంపించారు. అనంతరం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. కేవలం హిందూ సంఘాల కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బైఠాయించారు.
