నాలుగు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా

నాలుగు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా
  •     ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
  •     ఓటు వినియోగంలోనూ వారిదే హవా 
  •     గత ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా 24,860 ఓట్లేసిన అతివలు

ఆదిలాబాద్, వెలుగు : ఎన్నికలు సమీపిస్తుండడంతో అంతటా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. తాజాగా జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో నాలుగు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటరు తుది జాబితాలో 22,19,168 మంది ఓటర్లు ఉండగా.. అందులో 11,25,65 మహిళలు ఉంటే, 10,93,381 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇతరులు 131 మంది ఉన్నారు. పురుషుల కంటే 32,275 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 22,225 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

Also Read :  ప్రైవేటు ఆస్పత్రులకు ట్రేడ్​ లైసెన్స్​ ఏది?

జిల్లాలో గతంతో పోలిస్తే ఈసారి వ్యత్యాసం తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 31,127 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా ఈసారి ఆ సంఖ్య తగ్గింది. అయినప్పటికీ నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అటు ఆదిలాబాద్​లోనూ పురుషుల కంటే 9,448 మంది ఎక్కువగా ఉండగా.. మంచిర్యాలలో 599 మంది ఎక్కువగా ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 888 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా.. సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం 885 మంది పురుష ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఓటు వినియోగంలో మహిళా చైతన్యం

ఓటరు జాబితాలోనే కాదు.. ప్రతి ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా తమ ఓటు హక్కును అధికంగా వినియోగించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పురుషుల కంటే 24,860 మంది మహిళలు ఎక్కువగా ఓటేసి అభ్యర్థుల తలరాతలను మార్చేశారు. జనాభాలో, ఓటర్లలో ఎక్కువ శాతం ఉన్న మహిళలు అదే స్థాయిలో ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. 2018  అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,97,879 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. 7,73,019 మంది పురుషులు ఓటు వేశారు.

ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి పార్టీ తీసుకొస్తున్న పథకాల్లో ఎక్కువగా మహిళా సంక్షేమం కోసమే ఉండడం విశేషం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత కల్పించింది. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఈ పథకాలను మహిళలకు వివరిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. అటు కేంద్రంలోని బీజేపీ సైతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ఇలా ఈసారి మహిళా ఓటర్లే టార్గెట్​గా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.