ఖైదీలు వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతి

ఖైదీలు వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతి

భైంసా, వెలుగు: తెలిసో తెలియకో నేరం చేసి.. క్షణికావేశంలో తప్పు చేసి.. ఎందరో జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారు. రిమాండ్ ఖైదీలుగా ఉంటున్నారు. కటకటాల మధ్య ఉండే వారికి.. కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే మాటలే వారికి ఊరట. కానీ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ముందే ములాఖత్​లు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఖైదీలకు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జైళ్ల శాఖ ఖైదీలకు ఊరట కలిగించే పని చేస్తోంది. ఆన్​లైన్ ద్వారా ములాఖత్​లకు అవకాశం ఇస్తోంది.

7 వేల మంది.. ఏడాదిన్నరగా..

3 సెంట్రల్ జైళ్లు.. 7 జిల్లా జైళ్లు, 26 సబ్ జైళ్లు సహా.. రాష్ట్రంలో మొత్తం 36 జైళ్లు ఉన్నాయి. వీటిలో వెయ్యి మందికి పైగా జీవిత ఖైదీలు సహా మొత్తం 7 వేల మంది వరకు శిక్ష అనుభవిస్తున్నారు. వారానికి ఒకసారి తమ కుటుంబసభ్యులతో ములాఖత్ అయ్యేందుకు అవకాశం ఉంది. కానీ వీరికి 2020 జనవరి నుంచి ములాఖాత్ లేదు. దీంతో ఖైదీలు తమ కుటుంబ సభ్యులను కలిసే వీలు లేకపోయింది. ఈ నేపథ్యంలో వెబ్ సైట్ ద్వారా వీడియో కాల్​లో ములాఖత్ కల్పించేందుకు జైళ్ల శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి కంప్యూటర్, కెమెరాలు అందుబాటులో ఉంచింది.

ఆన్​లైన్ పలకరింపు ఇలా..

ఖైదీలను ఆన్ లైన్ ద్వారా పలకరించేందుకు ముందుగా www.eprisons.com వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అప్షన్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. తర్వాత సంబంధిత జైలులో ఉన్న ఖైదీల వివరాలను అక్కడి ఆఫీసర్లు పరిశీలించి, విజిటర్​కు సమాచారం అందిస్తారు. ఖైదీతో మాట్లాడే వారు ఒక రోజు ముందు ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. జిట్సీ మీట్ (jitsi meet) యాప్ ద్వారా ఖైదీలతో వారి కుటుంబీకులు, బంధువులు, మిత్రులు మాట్లాడవచ్చు. ఈ ప్రత్యేక వెబ్ సైట్ పాతదే అయినా.. చాలా మందికి తెలియదు. కరోనా కష్టకాలంలో తమ వారితో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంతో ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ వారి యోగ క్షేమాలు

 తెలుసుకుంటారని..

కరోనా వల్ల ఏడాదిన్నరగా ఖైదీలకు ములాఖాత్ ఇవ్వడం లేదు. వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వీరిని కలిసేందుకు కుటుంబ సభ్యులు చాలా సార్లు జైలుకు వచ్చారు. కానీ కలిసేందుకు వీలు లేదు. ఈ క్రమంలో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు కుటుంబీకులకు ఆన్ లైన్ లో మాట్లాడే విధానం అందుబాటులో తెచ్చాం. ఇది ఎంతో మంచిది.
‑ శోభన్ రూపాణి, జిల్లా జైలర్, ఆదిలాబాద్