
బెంగళూరు: కర్ణాటకలో ఒక మహిళ దారుణానికి ఒడిగట్టింది. కట్టుకున్న భర్త కళ్లలో కారం కొట్టి.. పీక మీద కాలేసి తొక్కి అత్యంత దారుణంగా హతమార్చింది. జూన్ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిప్తూరు తాలూకాలోని కడశెట్టి హళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుమంగళ అనే మహిళ, 50 ఏళ్ల వయసున్న శంకరమూర్తి భార్యాభర్తలు.
శంకర మూర్తి ఒక ఫాం హౌస్కు కాపలాగా ఉంటూ అక్కడే ఒంటరిగా ఒక గదిలో ఉంటున్నాడు. అతని భార్య సుమంగళ తిప్తూరులోని కల్పతరు గర్ల్స్ హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తూ అదే హాస్టల్లో ఉండేది. చెరో పని చేసుకుంటూ కుదిరినప్పుడు ఇంటికెళుతూ భార్యాభర్త జీవనం సాగిస్తున్నారు. అయితే.. హాస్టల్లో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తున్న క్రమంలో సుమంగళకు నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కొన్ని నెలలుగా ఈ ఇద్దరూ సుమంగళ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే.. ఇటీవల సుమంగళ ప్రవర్తనపై ఆమె భర్త శంకరమూర్తికి అనుమానమొచ్చింది. ఈ అనుమానం కారణంగా ఎక్కడ తమ వివాహేతర సంబంధం గుట్టు రట్టవుతుందోనన్న భయంతో కట్టుకున్న భర్తను చంపేయాలని సుమంగళ నిర్ణయించుకుంది. తన ప్రియుడు నాగరాజుకు ఈ విషయం చెప్పగా ఇద్దరూ కలిసి శంకరమూర్తికి మర్డర్ స్కెచేశారు. జూన్ 24న శంకరమూర్తి కళ్లలో కారం కొట్టి.. గొంతు మీద కాలేసి తొక్కి సుమంగళ అతి కిరాతకంగా తన భర్తను హత్య చేసింది.
సుమంగళ, ఆమె ప్రియుడు కలిసి శంకర మూర్తి డెడ్ బాడీని ఒక గోనె సంచిలోకి నెట్టేసి హత్య చేసిన ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్లి ఒక పొలంలోని బావిలో మృతదేహాన్ని పడేశారు. తొలుత శంకరమూర్తి మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శంకరమూర్తి బెడ్పై కారం మరకలు కనిపించడంతో ఇదేదో వేరే వ్యవహారమని డిసైడ్ అయి ఆ కోణంలో విచారణ చేశారు. శంకరమూర్తి భార్య సుమంగళను పోలీసులు తమదైన శైలిలో విచారించి, ఆమె కాల్ డీటైల్స్ రికార్డ్స్ను పరిశీలించాక హత్య చేశారని పోలీసులకు అర్థమైంది.
సుమంగళను నిలదీయగా తానే తన భర్తను కళ్లలో కారం కొట్టి చంపేశానని ఒప్పుకుంది. నోనవినకెరె పోలీస్ స్టేషన్లో సుమంగళపై, ఆమె ప్రియుడిపై హత్య కేసు నమోదు చేసి ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘాలయ హనీమూన్లో రఘువంశీ హత్య, గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్యతో పెళ్లంటేనే ఉలిక్కిపడే పరిస్థితులున్న తరుణంలో శంకరమూర్తి హత్య ఘటన యువతలో పెళ్లిపై అనాసక్తిని మరింత పెంచింది.