
హైదరాబాద్: భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సోమవారం సాయంత్రం నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో మోస్తారు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. గాలితో కూడిన వర్షం పడింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులకు ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాత భవనాలు, చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఒక్కసారిగా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్, వాహనదారుల అవస్థలు పడ్డారు. రాత్రి 8.30 గంటల తర్వాత వర్షం తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని.. అయితే అర్ధరాత్రి వరకూ వాతావరణం ముసురు పట్టి ఉంటుందని తెలిసింది.