జడలు విప్పుతున్న వరకట్న భూతం.. దేశంలో రోజుకు 19 మంది బలి

జడలు విప్పుతున్న వరకట్న భూతం.. దేశంలో రోజుకు 19 మంది బలి

వరకట్న భూతం దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు తీస్తోంది. వరకట్న నిషేధ చట్టం అమలులో ఉన్నప్పటికీ.. ఆ వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఒక ప్రభుత్వ మహిళా టీచర్ తానూ, తన మూడేండ్ల కూతురుకు నిప్పంటించుకొని ఆత్మహత్య కు పాల్పడటంతో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. ఇది కాక.. మొన్నటికి మొన్న గ్రేటర్ నోయిడాలో ఒక మహిళకు భర్త, అత్తమామలు నిప్పంటించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ రెండు ఘటనలు కూడా వరకట్న వేధింపులకు సంబంధించినవే. 

ఇవి మాత్రమే కాదు.. దేశంలో సగటున రోజుకు 19 మంది యువ మహిళలు వరకట్న భూతానికి బలౌతున్నట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ స్పష్టం చేస్తోంది. 2020లో వరకట్న వేధింపులతో రోజుకు 19 మందికి పైగా చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక 2017-2022 మధ్య సగటున దేశ వ్యాప్తంగా ఏటా 7 వేలకు పైగా వరకట్న మరణాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 2024లో నమోదైన మొత్తం 25 వేల 743 కేసుల్లో 4 వేల 383 కేసులు వరకట్న వేధింపులకు సంబంధించినవే. 

అంటే మొత్తం కేసుల్లో 17 శాతంగా ఉన్నాయి. ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతంలో ఈ కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, యూపీ, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రా ష్ట్రాల్లోనే 80 శాతం కేసులు నమోదయ్యాయి. నగరాల్లోనూ ఈ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. 19 నగరాలను పరిశీలిస్తే ఢిల్లీలో ఎక్కు వ(30శాతం)గా నమోదు అవుతుండగా, ఆ తర్వాత స్థానంలో కాన్పూర్, బెంగళూరు, లక్నో పాట్నా నగరాలు ఉన్నాయి.