
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని ఫిలిం నగర్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుదువ పెట్టిన నగలతో వ్యాపారి ఉడాయించడంతో అతని దగ్గర బంగారం కుదువ పెట్టిన స్థానికులు లబోదిబోమన్నారు. ఫిలిం నగర్లో మాణిక్ జ్యూవెలరీస్ పేరుతో మాణిక్ అనే వ్యక్తి నగల అమ్మకాలు, కుదువ వ్యాపారం చేస్తున్నాడు. మాణిక్ చౌదరి షాపు కొన్నేళ్ల నుంచి ఉండటంతో స్థానికులు నమ్మకంతో అతని దగ్గర నగలు కుదువ పెట్టారు. అయితే.. వారం రోజులుగా మాణిక్ చౌదరి షాప్ తెరవడం లేదు. ఇంట్లో కూడా ఎవరూ లేరు. మాణిక్ చౌదరికి కాల్ చేసినా కలవడం లేదు.
ఊహించని ఈ పరిణామంతో మాణిక్ చౌదరి ఉడాయించాడని స్థానికులకు విషయం అర్థమైపోయింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు బాధితులు క్యూ కట్టారు. సుమారు 2 వందల మంది బాధితులు ఉంటారని అంచనా. చాలామంది బాధితులకు ఈ విషయం తెలిసి నగల షాప్ దగ్గరకు వెళ్లి చూశారు. బాధితులకు మద్దతుగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పోలీసులతో మాట్లాడి న్యాయం చేయిస్తానని హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..
అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ వద్ద ఉన్న తులాల కొద్దీ బంగారాన్ని తాకట్టు పెట్టి వేలలో డబ్బులు తీసుకున్న వారిని మాణిక్ జువెలరీస్ నట్టేట ముంచింది. ఫిలింనగర్ గౌతమ్ నగర్ బస్తీలో రాజస్థాన్ కు చెందిన మాణిక్ చౌదరి కొన్ని సంవత్సరాల క్రితం అతని పేరుపైనే ఒక బంగారు దుకాణాన్ని తెరిచాడు. ఏళ్ల తరబడి షాపు కొనసాగుతుండటంతో స్థానికులంతా అతనిపై నమ్మకం పెంచుకున్నారు.
కుటుంబ ఆర్థిక అవసరాల కోసం తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కొద్దిపాటి డబ్బులు మాత్రమే తీసుకున్నారు. ఓ మహిళ ఆరు తులాలు బంగారాన్ని తాకట్టు పెట్టి కేవలం లక్ష రూపాయలు మాత్రమే తీసుకుంది. ఇలా ఎంతోమంది తమ బంగారాని కంటే అతి తక్కువ రుణాన్ని పొందారు. కొందరు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి పొందేందుకు అతని వద్ద తీసుకున్న రుణాన్ని సైతం చెల్లించారు.
బ్యాంకుల్లో లాకర్లో ఉన్న బంగారాన్ని తీసుకువచ్చి ఇస్తానని నమ్మించిన డబ్బులు కట్టించుకున్నాడు. సోమవారం షాపు మూసివేసి ఉండడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీసేందుకు ప్రయత్నించగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు పరారీలో ఉన్న మాణిక్ చౌదరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. బాధితులకు అండగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పోలీసులను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.