
తిరుమల: తిరుమల మొదటి ఘాట్లో పెను ప్రమాదం తప్పింది. 55వ మలుపు దగ్గర ఆర్టీసీ బస్ ముందు టైరు ఊడిపడింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం (ఆగస్ట్ 26) మధ్యా్హ్నం తిరుమల నుంచి బస్ తిరుపతికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, టీటీడి విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాల రద్దీని క్లియర్ చేశారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు పోలీసులు. భక్తులను మరో బస్సులో తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై బస్ డ్రైవర్ను ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులు, పోలీసులు, టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో మరో ప్రమాదం జరిగింది. ఏడో మైలు దగ్గర కారు కల్వర్టును ఢీకొట్టింది. కారులోని ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. బస్సును ఓవర్‌టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.