- రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిపై బురదజల్లడమేనని మండిపాటు
- ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ: హరీశ్‌రావు
హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు: కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షతో కుతంత్రాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ను టచ్ చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనన్నారు. కేసీఆర్‌కు సిట్నోటీసులపై గురువారం ఆయన స్పందించారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్దకాలం పాటు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని చెప్పారు.
అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురదజల్లాలని ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనన్నారు. ‘‘పరిపాలనలో చేతకానితనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్పేరుతో నోటీసులు ఇస్తున్నారు. ఇది రేవంత్‌రెడ్డి చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనం.
చరిత్రను సృష్టించినోడు కేసీఆర్అయితే.. ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదు.. అహంకారం అంతకంటే కాదు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉంది. మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు’’ అని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ తో హరీశ్‌రావు భేటీ ఆయ్యారు. గురువారం సిద్దిపేట పర్యటనపూర్తి చేసుకున్న హరీశ్ రావు.. రాత్రి ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో విచారణకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది.
రైతుల నోట్లో మట్టి కొట్టి బీరు ఫ్యాక్టరీకి నీళ్లు
సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించి నీటి విడుదల ఆపేసిన ప్రభుత్వం బీరు ఫ్యాక్టరీలకు మాత్రం కోరినంత నీటిని సరఫరా చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. గురువారం సిద్దిపేట మార్కెట్ యార్డులో ఆయన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలు, గణపురం ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించడం దారుణమన్నారు. రైతులకు ఇవ్వడానికి నీళ్లు లేవంటున్నారని, మరి బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.
ఎక్సైజ్ సెక్రటరీ స్వయంగా వచ్చి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఆపొద్దని ఆదేశాలు ఇవ్వడాన్ని బట్టి ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోందన్నారు. రైతులకు సాగునీరందించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.
