- హాఫీజ్ బాబానగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ చర్చి రోడ్ వరకు నిర్మాణం
- బండ్లగూడ నుంచి ఎర్రకుంట క్రాస్ రోడ్వరకు మరొకటి
- 100 అడుగుల మేర ఆరు లైన్లతో కన్స్ట్రక్షన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీ హాఫీజ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ చర్చి రోడ్ వరకు 100 అడుగుల మేర (మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా ఒమర్ హోటల్ నుంచి షోయబ్ హోటల్ వరకు ) ఆరు లైన్ల బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ తో ఫ్లై ఓవర్ నిర్మించేందుకు బల్దియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
దీనితో పాటుగానే ఇప్పుడున్న ఓవైసీ ఫ్లై ఓవర్ కోసం లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంపు కూడా నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, బండ్లగూడ నుంచి ఎర్రకుంట క్రాస్ రోడ్వరకు ఆరు లైన్ల మరో బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్కూడా కట్టేందుకు ప్రపోజల్స్రెడీ చేసింది.
దీనివల్ల పాతబస్తీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బాలాపూర్ తదితర ప్రాంతాలకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. రెండు ఫ్లైఓవర్లు, ర్యాంపు నిర్మాణానికి రూ. 385 కోట్లు అవసరం అవుతాయని జీహెచ్ఎంసీ పరిపాలనపరమైన అనుమతులు కూడా తీసుకుంది. ఈ డబ్బులను హెచ్ సిటీకి మంజూరు చేసిన రూ. 7038 కోట్ల నుంచి వెచ్చించనున్నట్లు తెలిసింది.
ఈ పనులకు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి టెండర్లను స్వీకరించేందుకు బల్దియా ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల 12న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, 20 వరకు టెండర్లను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్, ఫైనాన్స్ బిడ్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి 1 నుంచి పనులు ప్రారంభించనున్నారు.
