- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ములుగు, వెలుగు: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని, మాటల్లో తప్ప చేతల్లో చూపించడం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని గోదావరి నదీ తీర ప్రాంతాలైన బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రూ.2,500కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈనెల18న మేడారంలో జరిగిన రాష్ట్ర కేబినెట్మీటింగ్లో సైతం తీర్మానం చేసి సబ్‌కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. మేడారం జంపన్న వాగులో ఏడాదంతా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జంపన్నవాగుతో రామప్ప, లక్నవరం చెరువుల అనుసంధానం ఫురోగతిలో ఉందన్నారు. గురువారం మేడారంలోని మంత్రి సీతక్కతో కలిసి ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. టెంపుల్ సర్క్యూట్ లో భాగంగా గోదావరి నది వెంట నాలుగులైన్ల రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నామన్నారు. పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
మహాజాతరకు కోటిమందికిపైగా భక్తులు వస్తారన్నారు. ఇప్పటికే 80 లక్షల మంది తల్లుల దర్శనం చేసుకున్నారన్నారు. మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర భక్తజన సందోహం కనిపిస్తోందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారన్నారు. కేంద్ర మంత్రుల పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేయించామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మొద్దని మంత్రి పొంగులేటి సూచించారు.
