సిడ్నీ: స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌ను ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. స్వదేశంలో ఇండియాతో జరిగే సిరీస్‌ల తర్వాత ఆమె అన్ని ఫార్మాట్లలో అలీసా హీలీ స్థానంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించనుంది. ఇండియాతో సిరీస్ తర్వాత హీలీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో హీలీ మూడు వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
ఈ మేరకు ఇండియాతో జరిగే మూడు సిరీస్‌లకు ఆస్ట్రేలియా టీమ్‌ను సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. వచ్చే నెల 15న సిడ్నీలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఈ టూర్ మొదలవుతుంది. 19, 21న చివరి రెండు టీ20లు జరుగుతాయి. ఫిబ్రవరి 24, 27, మార్చి 1న మూడు వన్డేలు ఆడనున్నారు. మార్చి 6 నుంచి 9 వరకు వాకా గ్రౌండ్‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టూర్ తర్వాత జరిగే విండీస్ పర్యటనలో మోలినెక్స్ అన్ని ఫార్మాట్లలో ఆసీస్‌ను నడిపించనుంది. తాహ్లియా మెక్‌గ్రాత్‌ను వైస్ కెప్టెన్‌గా కొనసాగించనున్నారు.
టీ20 జట్టు: సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డెనర్, తాహ్లియా మెక్‌గ్రాత్, డార్సి బ్రౌన్, నికోలా కెరీ, కిమ్ గార్త్, గ్రేస్ హారీస్, ఫోబీ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎలైస్ పెర్రీ, మేఘన్ షుట్, అనాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వారెహామ్.
