లాహోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ బోణీ చేసింది. సైమ్ అయూబ్ (40, 2/29) ఆల్‌రౌండ్ షోకు తోడు సల్మాన్ ఆగా (39) రాణించడంతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 22 రన్స్ తేడాతో ఆసీస్‌పై గెలిచింది. ఫలితంగా సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ నెగ్గిన పాక్ 20 ఓవర్లలో 168/8 స్కోరు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (0) డకౌటైనా.. బాబర్ ఆజమ్ (24), ఉస్మాన్ ఖాన్ (18), మహ్మద్ నవాజ్ (15 నాటౌట్) రాణించారు.
జంపా 4, బియర్డ్‌మన్, బార్ట్‌లెట్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 146/8 స్కోరుకే పరిమితమైంది. కామెరూన్ గ్రీన్ (36) టాప్ స్కోరర్. బార్ట్‌లెట్ (34 నాటౌట్), ట్రావిస్ హెడ్ (23), రెన్‌షా (15) పోరాడినా ఫలితం దక్కలేదు. అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. సైమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం ఇదే వేదికపై జరుగుతుంది.
