చాట్ జీపీటీలో కీలక ఫైల్స్ అప్లోడ్..ఇండియన్ అమెరికన్ సైబర్ చీఫ్ మధుపై ఆరోపణలు

చాట్ జీపీటీలో కీలక ఫైల్స్  అప్లోడ్..ఇండియన్ అమెరికన్ సైబర్ చీఫ్ మధుపై ఆరోపణలు

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారాన్ని సైబర్  సెక్యూరిటీ అండ్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్  సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) తాత్కాలిక డైరెక్టర్  మధు గొట్టుముక్కల.. చాట్ జీపీటీ పబ్లిక్  వర్షన్​లో అప్​లోడ్  చేశారు. ఈ మేరకు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను ఆయన చాట్ జీపీటీ పబ్లిక్  వర్షన్​లో అప్​లోడ్  చేశారని డిపార్ట్​మెంట్​ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పినట్లు పొలిటికో అనే వార్తాపత్రిక ఒక కథనాన్ని వెలువరించింది. 

చీఫ్  ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనుమతి తీసుకొని మధు చాట్ జీపీటీని వాడుకున్నారని ఆ అధికారులు ఆరోపించినట్లు కథనం వెల్లడించింది. ‘‘డిపార్ట్​మెంట్​లోని ఇతర ఉద్యోగులకు చాట్​ జీపీటీని వాడేందుకు అనుమతి లేదు. కానీ.. మధు మాత్రం అధికారులపై ఒత్తిడి చేసి ఆ ఏఐ చాట్ బాట్​ను వాడుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పబ్లిక్  డొమైన్​లో పెట్టి ఆయన తన పదవిని దుర్వినియోగం చేశారు” అని అధికారులు చెప్పినట్లు కథనం పేర్కొంది. అయితే, మధు అప్ లోడ్  చేసిన ఫైల్స్​లో ఏవీ కూడా క్లాసిఫై  కాలేదని, కానీ ఆయన అప్​లోడ్  చేసిన ఫైల్స్  పబ్లిక్  కోసం కాదని, అవి సీఐఎస్ఏకు సంబంధించిన కాంట్రాక్టు  డాక్యుమెంట్లు అని పొలిటికో వివరించింది. వాటిని బయటపెట్టకూడదని పేర్కొంది.

ఎవరీ మధు గొట్టుముక్కల?

భారత సంతతికి చెందిన మధు గొట్టుముక్కల సీఐఎస్ఏలో సీనియర్  మోస్ట్  పొలిటికల్  ఆఫీసర్​గా పనిచేస్తున్నారు. చైనా, రష్యా వంటి ప్రత్యర్థి దేశాల నుంచి ప్రభుత్వ నెట్​వర్క్ ను కాపాడడం సీఐఎస్ఏ విధి. అలాంటి సీఐఎస్ఏకు మధును నిరుడు మేలో తాత్కాలిక చీఫ్ గా డిపార్ట్ మెంట్  ఆఫ్  హోంల్యాండ్  సెక్రటరీ క్రిస్టీ నియోమ్  నియమించారు.