ఈయూతో డీల్ ఇండియాకు కొత్త అవకాశాలు..అవకాశాలను తయారీదారులు వాడుకోవాలి

ఈయూతో డీల్ ఇండియాకు కొత్త అవకాశాలు..అవకాశాలను తయారీదారులు వాడుకోవాలి
  • ఫ్రీ ట్రేడ్​తో భారత్​, ఈయూ మార్కెట్ భారీగా పెరుగుతుంది: మోదీ
  • 27 ఈయూ దేశాలకు తక్కువ రేట్లకే నాణ్యమైన ఉత్పత్తులు అమ్మాలి
  • డీల్​తో ప్రపంచానికి భారత్  ఆశాకిరణంగా నిలిచిందని వెల్లడి

న్యూఢిల్లీ: యూరోపియన్  యూనియన్ (ఈయూ) తో ఫ్రీ ట్రేడ్ డీల్​తో కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ డీల్​తో రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్  సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంటు వద్ద మీడియాతో మోదీ మాట్లాడారు. 

ఈయూతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ డీల్ తో భారత్, 27 ఈయూ దేశాల మధ్య మార్కెట్  పెరుగుతుందన్నారు. ‘‘ఈ సంవత్సరం ఒక పాజిటివ్  నోట్​తో ప్రారంభమైంది. ఈయూతో ఫ్రీ ట్రేడ్  డీల్ కుదుర్చుకొని ప్రపంచానికి భారత్  ఒక ఆశాకిరణంగా నిలిచింది.

 ఆ ఒప్పందంతో దేశంలో యువత, తయారీదారులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆ ఒప్పందం వల్ల భారత్, 27 ఈయూ దేశాల మధ్య మార్కెట్  భారీగా పెరుగుతుంది. మన ఉత్పత్తులను తక్కువ రేట్లకు ఈయూ దేశాల్లో అమ్ముకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈయూ దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులను  విక్రయించి మారి మనసులు గెలవాలి. 

నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదు. కొన్ని దశాబ్దాల పాటు ఈయూ దేశాలపై మనదైన ముద్ర వేయాలి” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈయూతో డీల్  మన దేశ తయారీదారులతో పాటు రైతులు, యువతకు కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. 

స్కరణలతో దూసుకుపోతున్నం

ప్రస్తుతం దేశం రిఫార్మ్  ఎక్స్ ప్రెస్ తో దూసుకెళ్తోందని, ఎంతోకాలంగా పెండింగ్​లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నదని మోదీ చెప్పారు. ‘‘నేడు దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నది. వికసిత్ భారత్ కోసం ఎంపీలందరూ కృషి చేయాలి. 

పెండింగ్  సమస్యలకు పరిష్కారాలు దొరుకుతుండడంతో భారత్ ను సుస్థిర దేశంగా ప్రపంచం చూస్తున్నది” అని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందిస్తూ.. రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, యువత ఆశయాలను ప్రతిబింబించిందన్నారు. 

టెక్నాలజీపై మాట్లాడుతూ మనుషులకు టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదని మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ సామర్థ్యాన్ని అంగీకరించాలని, అయితే మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు.